- ఆదివాసీ గ్రామాల్లో ఘనంగా ‘విజ్జా మోహతూర్’ వేడుకల
- దైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ.. సంప్రదాయ పూజలు
- యువతకు సంస్కృతి, వ్యవసాయ ఆచారాల బోధన
- పంటలు సమృద్ధిగా పండాలని రైతుల ప్రార్థనలు
వర్షాకాలం ఆరంభంతో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ వ్యవసాయ సంస్కృతి కళకళలాడుతోంది. పంటల సాగు ప్రారంభానికి ముందు కులదైవాలకు విత్తనాలు సమర్పించి ఆశీర్వాదాలు పొందే ‘విజ్జా మోహతూర్’ సంప్రదాయ వేడుకలు జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, కెరమెరి, తిర్యాణి మండలాల్లో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రకృతి అనుగ్రహం, మంచి వర్షాలు, సమృద్ధి పంటల కోసం ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ‘విజ్జా మొహతూర్’ వేడుక వ్యవసాయానికి మాత్రమే కాకుండా ఆదివాసీ సంస్కృతి, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది.
ఆసిఫాబాద్ /జైనూర్, వెలుగు: వర్షాలు ప్రారంభం కావడంతో ఆదివాసీ రైతులు సాగు పనులకు రెడీ అవుతున్నారు. అయితే సంప్రదాయం ప్రకారం వీరు విత్తనాలను నేరుగా చేనులో చల్లకుండా ముందుగా కులదైవాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా మంచి దిగుబడి రావాలని ప్రార్థిస్తూ నైవేద్యాలు సమర్పిస్తారు. ‘విజ్జా మోహతూర్’ పేరుతో ఏరువాక పండుగను జరుపుకుంటారు. ఆ తర్వాతే విత్తనాలను పొలాలకు తీసుకెళ్లి సాగు పనులను ప్రారంభిస్తారు.
ప్రస్తుతం సీజన్ ప్రారంభం కావడంతో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రధాన దైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జైనూర్ మండలంలోని కిడపకిండి అవల్ పేన్, మర్లవాయి గండి అవల్ పేన్, సుంగాపూర్ అవల్ పేన్, మసెమల్ పేన్, జాముల్దర అవల్ పేన్, పోతరాజుల్ పేన్, అర్జున్ లొద్ది అవల్ పేన్ తదితర చోట్ల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి పాల్గొంటూ తమ సంస్కృతి, సంప్రదాయాలను తదుపరి తరాలకు పరిచయం చేస్తున్నారు.
విజ్జా మోహతూర్ సందర్భంగా గ్రామస్తులంతా ఒకేచోట చేరి పూజలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పెద్దలు యువతకు వ్యవసాయానికి సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాల ప్రాముఖ్యతను వివరిస్తుండటంతో ఈ వేడుక సామాజిక ఐక్యతకు కూడా వేదికగా మారుతోంది.
నైవేద్యం సమర్పించాకే..
కొన్ని గ్రామాల్లో కులదైవాలకు కోళ్లు, మేకల బలులు ఇచ్చే ఆచారం కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల పండ్లు, కొబ్బరికాయలు, సంప్రదాయ ఆహార పదార్థాలతో నైవేద్యాలు సమర్పిస్తున్నారు. గ్రామ పెద్దల ఆశీర్వాదాల అనంతరం రైతులు విత్తనాలను చేన్లలో చల్లుతూ సాగు పనులకు శ్రీకారం చుడుతున్నారు.
వ్యవసాయం కేవలం ఉపాధి మాత్రమే కాకుండా ప్రకృతి, దైవం, సంస్కృతితో ముడిపడిన జీవన విధానమని ఈ సంప్రదాయం చాటిచెబుతోందని గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పెరుగుతున్నా విజ్జా మోహతూర్ వంటి ఆచారాలను ఆదివాసీ సమాజం ఇప్పటికీ భక్తిశ్రద్ధలతో కొనసాగించడం విశేషం. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని రైతులు కులదైవాలను ప్రార్థిస్తున్నారు.
పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారం
మా పెద్దల కాలం నుంచి విజ్జా మోహతూర్ పూజలు చేస్తున్నాం. కులదైవాల ఆశీస్సులతోనే వ్యవసాయ పనులు ప్రారంభిస్తాం. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని విత్తనాలకు పూజలు చేశాం.
– నాగోరావ్, రైతు, గుడమామడ జైనూర్–
