భద్రాద్రిలో అడ్వంచర్ టూరిజం.. పూణే సంస్థతో కలిసి మూడు స్పాట్లు గుర్తింపు

 భద్రాద్రిలో అడ్వంచర్ టూరిజం..  పూణే సంస్థతో కలిసి మూడు స్పాట్లు గుర్తింపు
  • డిసెంబర్ నాటికి ఒక్క చోటైనా ప్రారంభించేలా ప్లాన్​ 
  • తొలిదశలో కిన్నెరసాని వద్ద 
  • జిప్​ లైన్ ఏర్పాటుకు అవకాశం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : అడవుల జిల్లా భద్రాద్రికొత్తగూడెం త్వరలో అడ్వంచర్​ టూరిజానికి వేదిక కానుంది. ఈ మేరకు జిల్లా ఆఫీసర్లు ప్లాన్​సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో అడ్వంచర్​ టూరిజానికి ఉన్న అవకాశాల గురించి ఈ రంగంలో అనుభవం ఉన్న పూణేకు చెందిన నైల్​ ఇండియా అడ్వంచర్స్​ ప్రయివేట్​ లిమిటెడ్​ ప్రతినిధులతో ఇటీవల కలెక్టర్​ జితేశ్​వి పాటిల్ చర్చలు జరిపారు. దీంతో ఈ సంస్థకు చెందిన ఒక బృందం జిల్లా యువజన క్రీడల శాఖాధికారులతో కలిసి జిల్లాలో వివిధ స్పాట్లను పరిశీలించింది. 

జిల్లాలోని దట్టమైన అడవులు.. కిన్నెరసాని హొయల మధ్య సాహసయాత్ర చేసేందుకు ఉన్న అవకాశాల గురించి వారు స్టడీ చేశారు. జిల్లాలోని మణుగూరు సమీపంలోని రథం గుట్ట, ఇల్లెందు సమీపంలోని ఊరగుట్ట, పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్ట్​లను అడ్వంచర్ టూరిజానికి అనుకూలంగా ఉంటాయని వారు గుర్తించారు. పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్ట్​ అద్దాల మేడ నుంచి ప్రాజెక్ట్​దగ్గర ఉన్న ద్వీపం వద్దకు ప్రత్యేకంగా జిప్​లైన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 

మొదటి దశలో రెండు కిలోమీటర్ల మేర రోప్ వే

 అడ్వంచర్​ టూరిజంలో భాగంగా మొదటి దశలో అడవుల్లోని భారీ చెట్లను కలుపుతూ అరకిలోమీటర్​ నుంచి రెండు కిలోమీటర్ల వరకు రోప్​ వే తరహాలో ఉండే జిప్​ లైన్స్​ ఏర్పాటు చేస్తారు. భారీ చెట్ట మధ్య చాలా ఎత్తులో జిప్​ లైన్​లో ప్రయాణించడం గొప్ప అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. చెట్ల మధ్యలోంచి స్ట్రైట్​ లైన్​, జిప్​ లైన్​, రోలర్​ కోస్టర్​ జిప్​లైన్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇవే కాకుండా జిప్​ బైక్​, స్కై సైకిల్​, కేబుల్​ రైల్​, 360 డిగ్రీస్​ ఫ్లయింగ్​ సైకిల్​, నెట్​ క్లైంబింగ్​, టైర్​ వాల్​ వంటి వాటిని వివిధ దశల్లో ప్రవేశ పెట్టాలని ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు. 

కలెక్టర్ ప్రత్యేక ఫోకస్ 

కేరళలో అడ్వంచర్​ టూరిజానికి బాగా ఆదరణ ఉంది. ఆ రాష్ట్రంలో అనేక చోట్ల ఇలాంటి స్పాట్లు ఉన్నాయి. దీంతో జిల్లాలో అడ్వంచర్​ టూరిజంపై కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​ ఫోకస్​ పెట్టారు. డిసెంబర్​లోగా జిల్లాలో గుర్తించిన మూడు ప్రాంతాల్లోని ఒక్క చోట అయినా అడ్వంచర్​ టూరిజం స్టార్ట్​ చేయాలని కలెక్టర్​ఆసక్తిగా ఉన్నారని జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పరంధామరెడ్డి చెప్పారు.