
- అమెరికా ఆర్థికాభివృద్ధిలో వారి పాత్ర కీలకమని కామెంట్
- వాళ్లు వెళ్లిపోతే నిపుణులను కోల్పోతమని ఆందోళన
వాషింగ్టన్: అమెరికాలోని ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయి టెన్షన్ పడుతున్న హెచ్1బీ ఉద్యోగులకు ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ ప్యానెల్ మద్దతుగా నిలిచింది. వారికి గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగించాలని బైడెన్ సర్కారుకు సూచించింది. సర్కారు ఈ సూచనను పాటించి, గ్రేస్ పీరియడ్ పొడిగిస్తే వేలాది మంది హెచ్ 1 బీ వీసా ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది. ఇటీవలి కాలంలో అమెరికాలోని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ఐటీ కంపెనీలు వేలాదిమంది హెచ్1బీ వీసా ఉద్యోగులను వివిధ కారణాల వల్ల తొలగించాయి. వీరంతా 60 రోజుల్లోనే మరో ఉద్యోగం పొందడం కష్టంగా మారుతోందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగులకు గ్రేస్ పీరియడ్‌ను 180 రోజులకు పెంచాలని సూచించినట్లు ఏషియన్ అమెరికన్లు, నేటివ్ హవాయిన్స్, పసిఫిక్ ఐలాండర్స్‌పై అడ్వైజరీ కమిషన్ సభ్యుడు అజయ్ జైన్ భుటోరియా తెలిపారు.
ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్‌కు రికమెండ్ చేశామని భుటోరియా వెల్లడించారు. ‘60 రోజుల వ్యవధిలో కొత్త జాబ్ వెతుక్కోవడం హెచ్1బీ వర్కర్లకు కష్టమైన పని. వారు ఎంతో నైపుణ్యంగల ఉద్యోగులు. అమెరికా ఆర్థికాభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకం. 60 రోజుల గడువు నిబంధనతో చాలా మంది అమెరికాను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వారు వెళ్లిపోతే స్కిల్డ్ ఎంప్లాయీస్‌ను మనం కోల్పోతాం. వారికి గ్రేస్ పీరియడ్ పొడిగిస్తే, కొత్త ఉద్యోగం చూసుకుని దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములవుతారు” అని అడ్వైజరీ కమిటీకి భుటోరియా స్పష్టంచేశారు. దీంతో ఆయన సిఫారసులను అడ్వైజరీ కమిటీ ఆమోదించింది.
వారికి వర్క్ పర్మిట్ జారీ చేద్దామా?
వీసా బ్యాక్ లాగ్‌లో ఐదేండ్లు లేదా ఐదేండ్లకుపైగా నిరీక్షిస్తున్న వారికి వర్క్ పర్మిట్ కార్డులను జారీచేయడంపై ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ కమిషన్ చర్చించింది. గ్రీన్ కార్డు అప్లికేషన్ ముందస్తు దశల్లో వర్క్ పర్మిట్ కార్డులను ఇవ్వాలని సిఫారసు చేసింది. దీనికి ఆమోదం లభిస్తే, కొన్నేండ్లుగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరపడుతుంది.