- కేసు నమోదు, త్వరలో విచారణ
పద్మారావునగర్, వెలుగు: ప్రాచీన శిలారూపాలను తొలగించే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రముఖ అడ్వకేట్ రామారావు ఇమ్మనేని శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. మణికొండలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని తిరిగి ఎందుకు స్వాధీనం చేసుకోకూడదంటూ వర్సిటీకి ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇవ్వడం దారుణమని తన పిటిషన్లో పేర్కొన్నారు.
1998లో అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీకి 200 ఎకరాల భూమి ఇచ్చిందని, అందులో 50 ఎకరాల్లో చాలా పురాతన కాలం నాటి శిలజ సంపద ఉండడంతో అధికారులు దానిని అలాగే ఉంచారని తెలిపారు. ఇందులో పత్తర్ దిల్, చుపాదిల్ అనే రెండు రకాల చారిత్రక విశేషమైన శిల సంపద ఉందని, ఇవి కొన్ని లక్షల సంవత్సరాల కిందటివని ఆర్కియాలజీ అధికారులు ధ్రువీకరించి వారసత్వ సంపదగా పేర్కొన్నారన్నారు. గతంలో విద్యార్థులు ఇక్కడ హెరిటేజ్ వాక్ కూడా చేశారన్నారు.
ఎంతో విలువైన వారసత్వ సంపదను, ప్రకృతిని విధ్వంసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. తన పిటిషన్ను పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసిందని, దీనిపై త్వరలో విచారణ జరగనుందని అడ్వకేట్ రామారావు తెలిపారు.
