తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. గోదావరి పరివాహక ప్రాంతాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల పంట నీట మునిగిపోయింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల నేపథ్యంలో ఏరియల్ సర్వే చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్వహించారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారని వెల్లడించింది. కడెం నుంచి భద్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కొనసాగుతుందని తెలిపింది. ఈ సర్వేలో సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారని వెల్లడించింది. దీనికి సంబంధించి హెలికాప్టర్ రూటు సహా తదితర విధి విధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షించి రూట్ ను ఫైనల్ చేయనుంది. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. సహాయక చర్యల్లో స్పీడ్ పెంచాలని సూచించారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీఎం ఏరియల్ సర్వే చేపట్టనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణపై వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ఇదిలా ఉంటే.. భద్రాచలంలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే.. గోదావరి వరద కాస్త తగ్గుతోంది. గంటగంటకూ వరద ఉధృతి తగ్గుతుండటంతో.. ప్రస్తుతం 71.90 అడుగులకు చేరింది. వరద బాధితుల కోసం జిల్లాకు 10 ఎన్డీఆర్ఎఫ్, 5 ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్స్ ను తరలించారు. 95 ముంపు బాధిత గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 77 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 20 వేల 922 మందిని.. సెంటర్లకు తరలించారు. భద్రాచలం టౌన్ తో పాటు చుట్ట పక్కల ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. భద్రాచలం దగ్గర 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా గోదావరి నీటిమట్టం పెరిగిందని స్థానికులు తెలిపారు. వరద కంటిన్యూ అవుతుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
