పాక్‌లో అఫ్గాన్ రాయబారి కూతురి కిడ్నాప్.. టార్చర్ చేసి రిలీజ్

పాక్‌లో అఫ్గాన్ రాయబారి కూతురి కిడ్నాప్.. టార్చర్ చేసి రిలీజ్

కాబూల్: పాకిస్థాన్‌లో అఫ్గానిస్థాన్ రాయబారి కూతురిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీవ్రంగా హింసించి, ఆ తర్వాత కొన్ని గంటలకు రిలీజ్ చేశారు. శుక్రవారం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై అఫ్గాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్‌లో ఉంటున్న తమ దేశ రాయబారులు, రాయబార కార్యాలయాల సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కిడ్నాప్ వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఇస్లామాబాద్‌లో అఫ్గాన్ రాయబారిగా ఉన్న నజిబుల్లా అలిఖిల్ కూతురు సిల్సిలా అలిఖిల్‌ (26) శుక్రవారం  తన ఇంటి నుంచి జిన్నా సూపర్ మార్కెట్‌కు వెళ్తుండగా కొందరు దుండగులు కిడ్నాప్‌ చేశారు. ఆమెను సిటీకి దూరంగా తీసుకెళ్లి క్రూరంగా టార్చర్ చేసి, ఆ తర్వాత రిలీజ్ చేశారు.  ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని అఫ్గాన్ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఘటనను ఖండించిన అఫ్గాన్ ప్రభుత్వం.. పాక్‌లో ఉన్న దౌత్య సిబ్బంది, అధికారులు, వారి కుటుంబాల భద్రత ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన వారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని, తమ దౌత్య సిబ్బంది కుటుంబాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. అయితే అఫ్గాన్‌పై క్రమంగా తాలిబన్‌ ఉగ్ర సంస్థ పట్టుబిగిస్తున్న నేపథ్యంలో వాళ్లకు పాకిస్థాన్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని అఫ్గాన్ ప్రభుత్వం ఆరోపిస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం కనిపిస్తోంది.