హెలికాప్టర్ నిండా డబ్బులతో పారిపోయిన దేశాధ్యక్షుడు

హెలికాప్టర్ నిండా డబ్బులతో పారిపోయిన దేశాధ్యక్షుడు

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు పూర్తిగా అధీనంలోకి తెచ్చుకున్నారు. రాజధాని కాబూల్ ను వశం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. తాలిబన్ల పాలనను తలచుకుని అఫ్గాన్ ప్రజలు భయపడుతున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. అఫ్గాన్ మాజీ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఓటమిని ఒప్పుకుని పారిపోయిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

నాలుగు కార్ల నిండా డబ్బులు నింపుకుని హెలికాప్టర్ లో అష్రఫ్ ఘనీ వెళ్లారని అఫ్గాన్ లోని రష్యన్ ఎంబసీ తెలిపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. హెలికాప్టర్ లో మరింత డబ్బును కుక్కేందుకు యత్నించారని, అయితే సరిపడా స్థలం లేకపోవడంతో పెద్దమొత్తంలో డబ్బులను వదిలేసి వెళ్లినట్లు సమాచారం. కాగా అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ తొలుత తజకిస్తాన్‌కు వెళ్లిపోయినట్లు రిపోర్టులు వచ్చాయి. అలాగే ఘనీ, ఆయన భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారు ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌కు పారిపోయారని అల్ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఘనీ ఎక్కడ తలదాచుకున్నదీ స్పష్టత లేదు.