PAK vs AFG: ఆసియా కప్ ముందు ఊహించని షాక్.. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిన పాకిస్థాన్

PAK vs AFG: ఆసియా కప్ ముందు ఊహించని షాక్.. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిన పాకిస్థాన్

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ లో పసికూన అనే ట్యాగ్ నుంచి బయటకు వచ్చింది. గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు సాధిస్తున్న విజయాల్లే ఇందుకు నిదర్శనం. రెండేళ్లుగా వన్డే, టీ20 క్రికెటర్ లో ఆఫ్ఘనిస్తాన్ నికడగా ఆడుతోంది. ముఖ్యంగా 2024 లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో అంచానాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు.. సెమీస్ కు వెళ్లి సంచలనం సృష్టించింది. ఫామ్ కొనసాగిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ట్రై సిరీస్ లో తాజాగా పాకిస్థాన్ జట్టుకు షాక్ ఇచ్చింది. మరోసారి తాము చిన్నజట్టు కాదని నిరూపిస్తూ సమిష్టిగా ఆడి విజయం సాధించింది. 

మంగళవారం (సెప్టెంబర్ 2) షార్జా క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్ జట్టుపై ఆఫ్ఘనిస్తాన్ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ట్రై సిరీస్ లో వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్ లో రాణించి భారీ స్కోర్ చేసిన రషీద్ సేన.. తర్వాత బౌలింగ్ లో సమిష్టిగా రాణించి పాకిస్థాన్ కు ఈ సిరీస్ లో తొలి ఓటమిని రుచి చూపించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ గర్భాజ్ 8 పరుగులకే ఔటైనా.. సెదికుల్లా అటల్ ఇబ్రహీం జాద్రాన్ భాగస్వామ్యంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టును నిలబెట్టారు.

వీరిద్దరూ రెండో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో అటల్ (64), ఇబ్రహీం(65) తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వారు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఓ మాదిరి స్కోర్ కే పరిమితమైంది. పాకిస్థాన్ బౌలర్లలో ఫహీం అష్రాఫ్ 4 వికెట్లతో రాణించాడు. 170 పరుగుల లక్ష్య చేధనలో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులకు పరిమితమైంది. స్పిన్నర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ తలో మూడు వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ ను ఓడించారు.