T20 World Cup 2024: బంగ్లాదేశ్ పై ఆఫ్గనిస్తాన్ అద్భుత విజయం : సెమీస్ నుంచి ఆసీస్ ఔట్

T20 World Cup 2024: బంగ్లాదేశ్ పై ఆఫ్గనిస్తాన్ అద్భుత విజయం : సెమీస్ నుంచి ఆసీస్ ఔట్

టీ 20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది. సంచలన విజయంతో తొలిసారి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మంగళవారం (జూన్ 25) హోరీహోరీగా సాగిన చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో గ్రూప్ 1 లో భారత్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కు చేరింది. ఇదే గ్రూప్ లో భారత్ ఇప్పటికే సెమీస్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా సెమీస్ కు చేరుకున్నాయి. 

116 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. పేసర్లు ఫజల్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్ విజృంభించడంతో 23 పరుగులకే మూడు వికెట్లను పడగొట్టింది. ఈ దశలో సౌమ్య సర్కార్ (10), లిటన్ దాస్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. స్వల్ప భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత సౌమ్య సర్కార్ ఔటయ్యాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు లిటన్ దాస్ (54) క్రీజ్ లో పాతుకుపోయాడు. హాఫ్ సెంచరీ చేసి చివరి వరకు క్రీజ్ లో ఉన్నా.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. 18 ఓవర్లో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.  

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. పిచ్ బౌలింగ్ కు అనుకూలించడంతో ఓపెనర్లు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. మరీ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ వికెట్ కు ప్రాధాన్యమిచ్చారు. ఆ ఆ తర్వాత వచ్చిన వారు బ్యాట్ ఝళిపించలేకపోయారు. 43 పరుగులు చేసిన గర్భాజ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇబ్రహీం జద్రాన్ (18) రషీద్ ఖాన్ (19) రాణించారు.