6 గంటల వెయిటింగ్​ తర్వాత.. ఢిల్లీ సీఎం నామినేషన్​

6 గంటల వెయిటింగ్​ తర్వాత.. ఢిల్లీ సీఎం నామినేషన్​

నామినేషన్​ను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర
కేజ్రీవాల్​ను అపలేరంటూ మనీశ్ సిసోడియా ట్వీట్

న్యూఢిల్లీ: ఆరు గంటల వెయిటింగ్ తర్వాత ఢిల్లీ సీఎం, ఆమ్​ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్​ కేజ్రీవాల్  మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజు కావడంతో జామ్​నగర్​లో నామినేషన్​ దాఖలు చేయడానికి ఏకంగా 66 మంది అభ్యర్థులు వచ్చారు. సీఎం కేజ్రీవాల్​ కూడా తన కుటుంబంతో కలిసి ఆఫీసుకు చేరుకున్నారు. అప్పటికే పెద్ద లైన్​ ఉండడంతో మిగతా వారితో కలిసి వేచి ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకే ఆఫీసు క్లోజ్​ చేయాల్సి ఉండగా.. 2:30 లోగా వచ్చిన వారందరి నామినేషన్లు స్వీకరిస్తామని అధికారులు ప్రకటించారు. టైంలోగా వచ్చిన వారికి టోకెన్లు అందించారు. తొలిసారి నామినేషన్​ వేసే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆలస్యం జరిగిందని కేజ్రీవాల్​ చెప్పారు.

సంతోషంగా ఉంది.. కేజ్రీవాల్

‘జామ్​నగర్​లో నామినేషన్​ వేయడానికి వచ్చా.. ఇక్కడ చాలా రష్​ ఉంది. నా టోకెన్​ నెంబర్​45. నాలాగే చాలామంది వచ్చారు. వీళ్లందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి పోటీ చేస్తున్నపుడు పొరపాట్లు సహజం.. మేం కూడా తడబడ్డాం. సోమవారమే నామినేషన్​ వేయాల్సింది. కానీ ర్యాలీ కారణంగా ఆలస్యమైంది. మద్ధతుదారులను మధ్యలో వదిలి నామినేషన్​ వేయాలని అన్పించలేదు’ అంటూ కేజ్రీవాల్​ ట్వీట్​ చేశారు.

బీజేపీ కుట్ర పన్నింది.. సిసోడియా

‘కేజ్రీవాల్​ నామినేషన్​ దాఖలు చేయకుండా అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర పన్నింది. అందులో భాగంగానే పెద్ద సంఖ్యలో అభ్యర్థులను పంపింది. పేపర్ల పరిశీలనలో అధికారులు కావాలనే ఆలస్యం చేశారు. పేపర్ల పరిశీలనకు ఒక్కో అభ్యర్థికి అరగంట కేటాయించారు.. పూర్తిచేయని పేపర్లతో పాటు ప్రపోజర్స్ లేని అభ్యర్థుల పత్రాలనూ పరిశీలించారు. మీరేం చేసినా కేజ్రీవాల్​ను ఆపలేరు. ఆయన మళ్లీ సీఎం కుర్చీలో కూడా కూర్చుంటారు’ అంటూ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా ట్వీట్​ చేశారు.

see also:ఏమైనా చేస్కోండి సీఏఏ ఉంటది