అమ్మి రెండు నెలలైనా..శనగల పైసలు ఇస్తలేరు

అమ్మి రెండు నెలలైనా..శనగల పైసలు ఇస్తలేరు
  • జిల్లాలో  రూ. కోటి బకాయిలు..ఇబ్బంది పడుతున్న రైతులు

ఆసిఫాబాద్,వెలుగు: శనగలు అమ్మి 60  రోజులు గడుస్తున్నా.. పైసలు ఇస్తలేరు.  పది రోజుల్లో పైసలు వస్తాయన్న ఆఫీసర్లు ఇప్పుడు రేపుమాపు అంటూ దాటవేస్తున్నారు. దీంతో  అప్పు చేసి పంట సాగుచేసిన రైతులు చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు ఎప్పుడిస్తారో కూడా చెప్పకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్​ ప్రారంభమవుతోందని.. పంటల సాగు కోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలలాయే..
రెండు నెలల క్రితం ఆసిఫాబాద్ జిల్లాలో మార్క్​ఫెడ్ ​ద్వారా క్వింటాలు​కు రూ.5,230 చొప్పున 1,965 క్వింటాళ్ల శనగలు కొనుగోలు చేశారు. దాదాప రూ. 1.03 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు ఖాతాలో డబ్బులు జమకాలేదు. దీంతో రైతులు అసలు డబ్బులు వస్తాయా? రావా అని ఆందోళన చెందుతున్నారు. అసలే వానాకాలం సీజన్ ​ప్రారంభమైందని.. ఇప్పటి వరకు జిల్లా అధికారులు ఏ పంటలు సాగుచేయాలో చెప్పలేదని, మరోవైపు దిగుబడి అమ్మిన డబ్బులు రాలేదని ఆగమవుతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రభుత్వం ఏ పంట కొన్నా.. డబ్బులు  ఇవ్వడంలో జాప్యం చేస్తోందని రైతులు పేర్కొంటున్నారు.
పైసలు రాలే..
నేను రెండున్నర ఎకరాల్లో శనగ సాగు చేసిన. 24  క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్క్​ఫెడ్​ కొనుగోలు కేంద్రంలో అమ్మి నెలైంది. ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. ఆఫీసర్లకు ఫోన్​ చేస్తే లేపు తలేరు. పైసలు జల్దిన వచ్చేటట్లు చేయండి. మా ఊర్ల ఎవరికి పైసలు పడలే.  -ఎల్కరి సంతోష్, ఖర్జి, దహెగాం
డబ్బులు రిలీజ్​ కాలే..
రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన శనగల డబ్బులు హెడ్ ఆఫీస్​ నుంచి ఇంకా రిలీజ్​కాలేదు. డబ్బులు రాగనే రైతులకు అందజేస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -  కృష్ణవేణి, మార్క్ ఫెడ్ డిస్ట్రిక్ట్​మేనేజర్​