బాసర ట్రిపుల్ ఐటీలో ప్రారంభమైన తరగతులు

బాసర ట్రిపుల్ ఐటీలో ప్రారంభమైన తరగతులు
  • 7 రోజుల ఆందోళనల తర్వాత.. యధావిధిగా క్లాసులకు హాజరైన విద్యార్థులు

నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీలో ఇవాళ తరగతులు ప్రారంభమయ్యాయి. నిన్న విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డితో అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు సఫలం కావడంతో విద్యార్థులు తమ ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇవాళ మంగళవారం 7 రోజుల ఆందోళన అనంతరం క్లాసులకు హాజరయ్యారు.నెలరోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని, అలాగే అతిత్వరలోనే రెగ్యులర్​  వైస్ ఛాన్స్ లర్ ను నియమిస్తామని.. 15 రోజుల్లో మళ్లీ క్యాంపస్​కు వస్తానని మంత్రి హామీతో విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.

రాత్రి 9.30 నుంచి ఇంచార్జ్ వీసీ రాహుల్ బొజ్జాతో కలసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెండున్నర గంటలకుపైగా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. విద్యార్థులకు ల్యాప్​టాప్స్​ పంపిణీ చేస్తామని, నాణ్యమైన ఆహారం అందించడం సహా అన్ని  సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి హామీతో  స్టూడెంట్స్ తమ ఆందోళన విరమించి క్లాసులకు హాజరయ్యారు. 

మొక్కవోని ధైర్యంతో వారం రోజులుగా.. చారిత్రక స్థాయిలో బాసర ట్రిపుల్​ ఐటీ విద్యార్థులు నిర్వహించిన ఆందోళన చర్చనీయాంశం అయింది. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చే రీతిలో మొక్కవోని ధైర్యంతో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. విద్యార్థులు 7 రోజులపాటు నిర్వహించిన ఆందోళన ప్రభుత్వాన్ని కదిలించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో .. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా లేనంతగా క్యాంపస్ ​బయట కొద్దిరోజులుగా వందలాది మంది పోలీసులను మోహరించడం, స్టూడెంట్లకు మద్దతు తెలిపేందుకు వచ్చేవాళ్లను అరెస్ట్​ చేయడం వంటి పరిణామాలపై అందరి దృష్టిని ఆకర్షించింది. స్టూడెంట్ల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల లీడర్లను, విద్యార్థి సంఘాల నేతలను, ఆఖరికి విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అరెస్ట్ చేయడం తదితర చర్యలు తెలుగు గడ్డపై చర్చనీయాంశం అయ్యాయి. ఎట్టకేలకు ఆందోళన ముగించి ఇవాళ తరగతులు ప్రారంభం కావడంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.