
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్మించిన 90- డిగ్రీల బ్రిడ్జి నిర్మాణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 90 డిగ్రీస్‌లో బ్రిడ్జి నిర్మించిన అధికారులపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న మధ్యప్రదేశ్ సర్కార్.. సదరు అధికారులపై వేటు వేసింది. ఇదిలా ఉండగానే.. అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో అద్భుత ఇంజనీరింగ్ కళాఖండం వెలుగులోకి వచ్చింది. గతంలో 90 డిగ్రీల బ్రిడ్జి నిర్మిస్తే.. ఈసారి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB)ని ఏకంగా Z- ఆకారంలో నిర్మించడం హెలెట్.
ఈ కళాఖండాన్ని ఇండోర్‌లో నిర్మిస్తున్నారు. ఇండోర్‌లోని లక్ష్మీబాయి నగర్ నుంచి పోలో గ్రౌండ్ మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తోంది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD). పోలో గ్రౌండ్ సమీపంలో నిర్మిస్తోన్న ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జిని Z ఆకారంలో ఉండటంతో బ్రిడ్జి రెండు పాయింట్ల వద్ద 90 డిగ్రీల మలుపు ప్రజలను, వాహనదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ Z షేప్ వంతెన నిర్మాణంపై స్థానికులు, వాహనదారులు, ట్రక్కు డ్రైవర్లు తీవ్ర అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ Z ఆకారపు బ్రిడ్జి నిర్మాణంపై ఓ డ్రైవర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పదునైన మలుపుల వల్ల లోడ్‌తో వెళ్లే వాహనాలను నడపడం చాలా కష్టం, ప్రమాదకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇండోర్ ఎంపీ శంకర్ లాల్వానీ మాట్లాడుతూ.. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి డిజైన్ మార్చాలని సంబంధిత మంత్రికి జూన్ లో లేఖ రాశానని తెలిపారు. ప్రమాదాలు, వాహనాల రద్దీని నివారించడానికి ఈ ప్రమాదకరమైన మలుపును సరిచేయమని అధికారులకు సూచించానని చెప్పారు.
Z ఆకారపు బ్రిడ్జి నిర్మాణంపై రోజురోజుకు విమర్శలు ఎక్కువ అవుతుండటంతో PWD అధికారులు మేల్కొన్నారు. బ్రిడ్జి డిజైన్‌ను మారుస్తామని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గుర్మీత్ కౌర్ భాటియా మాట్లాడుతూ.. మీడియాలో లేవనెత్తిన ఆందోళనల నేపథ్యంలో బ్రిడ్జి డిజైన్‌ను తిరిగి పరిశీలిస్తున్నామని.. అవసరమైతే డిజైన్‌లో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు.
Z ఆకారపు బ్రిడ్జి నిర్మాణం పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. ఈ నిర్మాణాన్ని టార్గెట్ చేస్తూ అధికార బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ సింగ్ వర్మ మాట్లాడుతూ.. పీడబ్ల్యూడీ మంత్రి నిద్ర పోతున్నాడని ఎద్దేవా చేశారు. భోపాల్‌లో 90 డిగ్రీల బ్రిడ్జి నిర్మిస్తే.. ఇండోర్ ఇంజనీర్లు రెండు 90-డిగ్రీల మలుపులు నిర్మించి ఆ రికార్డును అధిగమించాలని చూస్తున్నారని సెటైర్ వేశారు. నిర్మాణంలో ఉన్న Z ఆకారపు బ్రిడ్జి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులను ఏకీపారేస్తున్నారు నెటిజన్లు. అసలు ఇలాంటి తలతిక్క ఐడియాలు ఎలా వస్తాయంటూ కామెంట్లతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.