ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి.. రాజస్థాన్​ నుంచి హైదరాబాద్​కు

ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి.. రాజస్థాన్​ నుంచి హైదరాబాద్​కు
  • మొయినాబాద్ లోని సురంగల్ వద్ద పట్టుకున్న పోలీసులు
  •  ముగ్గురు నిందితుల అరెస్ట్
  • 100 కిలోల సరుకు, కారు, స్కూటీ స్వాధీనం

చేవెళ్ల, వెలుగు: ఒడిశాలో గంజాయి కొని రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు తరలించిన వ్యక్తితో పాటు సరుకును కొనేందుకు యత్నించిన మరొకరిని మొయినాబాద్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం మొయినాబాద్ పీఎస్ లో రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి.. అడిషనల్ డీసీపీ రష్మీ పెరుమాళ్, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్ రెడ్డితో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్​లోని బికనీర్ జిల్లాకు చెందిన బాఫర్ ఖాన్ సిటీకి వచ్చి మేడ్చల్ లో ఉంటూ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గంజాయి సప్లయర్ అయిన బాఫర్ ఖాన్.. ఈనెల 13 ఒడిశాలోని రాయగఢ్​జిల్లా పదంపూర్ వెళ్లాడు. అక్కడ మనోజ్ అనే వ్యక్తి నుంచి  రూ.5.50 లక్షల విలువైన 100 కిలోల గంజాయి కొన్నాడు. దాన్ని తీసుకుని కారులో రాజస్థాన్ వెళ్లాడు. అయితే, ధూల్ పేటలో ఉండే సునీల్ సింగ్ కు రూ. వెయ్యి చొప్పున కిలో గంజాయిని అమ్మేందుకు బాఫర్ ఖాన్ డీల్ కుదర్చుకున్నాడు.  దీంతో గంజాయి తీసుకుని సిటీకి వచ్చాడు.

సరుకును అప్పగించేందుకు సునీల్ కు కాల్ చేయగా.. తాను ప్రస్తుతం అందుబాటులో లేనని చెప్పాడు.  మొయినాబాద్ మండల పరిధి సురంగల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని ఓ వెంచర్ లో నిర్మిస్తున్న రూమ్​ వద్ద తన తమ్ముడు నితేశ్ సింగ్, బావమరిది వినేశ్ సింగ్ ఉంటారని, వారికి సరుకు అప్పగించాలని బాఫర్ ఖాన్ కు సునీల్ సింగ్ చెప్పాడు. దీంతో బాఫర్ ఖాన్ సిటీ నుంచి సురంగల్ కు కారులో వెళ్లాడు. అయితే, గంజాయి డీల్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు సురంగల్ లోని వెంచర్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ బాఫర్ ఖాన్ తో పాటు స్కూటీపై అనుమానాస్పదంగా తిరుగుతున్న నితేశ్​సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. బాఫర్ ఖాన్ కారును తనిఖీ చేసి 100 కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. గంజాయితో పాటు కారు, స్కూటీ, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిపై కేసు ఫైల్ చేసి రిమాండ్ కు తరలించారు.