ఉదయం పెళ్లి.. మధ్యాహ్నం వరుడికి కరోనా పాజిటివ్: పెళ్లికూతురు, బంధువుల్లో టెన్షన్

ఉదయం పెళ్లి.. మధ్యాహ్నం వరుడికి కరోనా పాజిటివ్: పెళ్లికూతురు, బంధువుల్లో టెన్షన్

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ రోజు రోజుకీ తీవ్రమవుతోంది. సిటీలు, పట్టణాలు మొదలు చిన్న చిన్న పల్లెలకు కూడా వైరస్ విస్తరించింది. రోజు వేలాది సంఖ్యలో టెస్టులు చేస్తున్నప్పటికీ.. పరీక్ష ఫలితాలను వెల్లడించడానికి రెండు మూడ్రోజుల వరకు సమయం పడుతోంది. దీంతో టెస్టులు చేయించుకుున్న వాళ్లు క్వారంటైన్‌లో ఉండకుండా తమ పనులు యథావిధిగా చేసుకుంటుండడంతో అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇవాళ కడప జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కరోనా కలకలం సృష్టించడానికి ఇటువంటి సంఘటనే కారణమైంది.

మూడ్రోజుల క్రితం టెస్టు.. ఉదయం పెళ్లి.. మధ్యాహ్నం రిజల్ట్

కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామంలో శుక్రవారం ఉదయం ఓ వివాహ వేడుక జరిగింది. అయితే ముందు జాగ్రత్తగా వధూవరులు ఇద్దరూ మూడ్రోజుల క్రితమే కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కానీ పరీక్ష ఫలితం రాలేదు. వారికి ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో యథావిధిగా అనుకుున్న ముహుర్తానికే ఈ రోజు ఉదయం ఆ యువ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. అయితే మధ్యాహ్నానికి టెస్టు రిపోర్టులు రాగా.. పెళ్లి కుమారుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్య అధికారులు వధూవరులను క్వారంటైన్ చేశారు. పెళ్లికుమారుడితో సన్నిహితంగా మెలిగిన వధువు సహా పెళ్లికి హాజరైన బంధువులు కూడా ఆందోళన చెందుతున్నారు. వధూవరుల కుటుంబసభ్యులతోో పాటు ఆ వివాహానికి వెళ్లిన బంధువులందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.

కాగా, ఏపీలో ఇప్పటి వరకు 80,858 కరోనా కేసుల నమోదయ్యాయి. అందులో 933 మంది మరణించగా.. ఇప్పటి వరకు 39,935 మంది మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 39990 మంది వివిధ కొవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.