- అయినా మనిషికి ఆశ చావడం లేదు
- ఓ కేసు విచారణలో జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ఆసక్తికర కామెంట్లు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ‘‘మనిషి తన అవసరాలను మరిచి తీవ్రమైన కోరికలతో ఉంటున్నాడు. అంతులేని సంపాదన కోసం ఆశ, వేలకొద్దీ ఎకరాలున్నా సరిపోవడం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రతి మనిషికి ఆరడుగుల పొడవు, మూడు అడుగుల నేల సరిపోతుందని చెప్పాడు. అయినా మనిషి మారడం లేదు’’ అని జస్టిస్విజయ్సేన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివాదంలో ఉన్న తన భూములను ఇప్పించాలని ఓ సర్పంచ్ పిటిషన్వేయగా, ఆ కేసును జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి విచారించారు.
ఆయన తన ఎదుట వాదనలు వినిపిస్తున్న న్యాయవాదితో ‘‘చెప్పండి మిస్టర్అడ్వొకేట్.. ఒక సాధారణ మనిషికి ఎంత భూమి ఉంటే సరిపోతుంది’’ అని ప్రశ్నించారు. తన అవసరాలకు సరిపడా అని ఆయన సమాధానం చెప్పారు. దీంతో జస్టిస్విజయ్సేన్రెడ్డి ‘‘అవును మీరు చెప్పింది నిజమే. కానీ, ఇప్పుడు మనిషికి ఎన్ని వేల ఎకరాలున్నా సరిపోవడం లేదు. వాటిని అలాగే ఏండ్ల తరబడి పడావు పెడుతున్నాడు. దీనివల్ల ఎవరికి ఉపయోగం? శ్రీకృష్ణుడు గీతలో మనిషికి ఆరు అడుగులు సరిపోతుందని చెప్పలేదా?’’ అని ప్రశ్నించారు.
పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉంటున్నరు
మన దేశంలో మొత్తం స్కీంలే అని, అసలు ఎన్ని స్కీంలు ఉన్నాయో లెక్క కూడా తెలియడం లేదని జస్టిస్విజయ్సేన్రెడ్డి అన్నారు. 60 ఏండ్ల వారికో స్కీం, 30 ఏండ్ల వారికో స్కీం, 22 ఏండ్ల వారికో స్కీం.. ఇలా వయసు, కులాలు, మతాలను బట్టి లెక్కకు దొరకని స్కీంలు పెట్టారన్నారు. ఇన్ని స్కీంలు అమలు చేసినా, పేదలు పేదవారిగానే ఉంటున్నారని, ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా తనకు తెలిసిన ఒక విషయాన్ని ఉదహరించారు. కొన్నేండ్ల కింద ఒక కుటుంబం మొత్తం డబుల్బెడ్రూం ఇండ్ల కోసం అప్లై చేసిందని, అందులో ఐదుగురికి ఐదు డబుల్బెడ్రూం ఇండ్లు వచ్చాయన్నారు. కుటుంబంలోని ఐదుగురు కూడా ఆ స్కీంలో అర్హులు అయ్యారని, అధికారులు సరైన విచారణ జరపకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు.
కొన్ని స్కీంలు మంచివే అయినా, అవి దక్కాల్సిన వారికి దక్కితే బాగుంటుందన్నారు. మరో కేసు విచారణ సందర్భంగా ఓ పిటిషనర్ తన కోళ్లఫారంలో కోళ్లు చనిపోవడంతో నష్టం వచ్చిందని, సదరు శాఖ ఇస్తానన్న సబ్సిడీ ఇప్పించాలని హైకోర్టు తలుపు తట్టారు. దీంతో సబ్సిడీలపైనా జస్టిస్విజయ్సేన్రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నో స్కీముల్లో సబ్సిడీలు ఇస్తున్నారని, కానీ, కొందరు ఈ సబ్సిడీలు తీసుకుంటూ ఎంజాయ్‌చేస్తూ హార్డ్‌వర్క్ చేయడం మర్చిపోతున్నారన్నారు.
