భారత్ బాటలోనే ఆప్ఘాన్.. ఇదే జరిగితే పాకిస్థాన్ ఇక ఏడారే..!

భారత్ బాటలోనే ఆప్ఘాన్.. ఇదే జరిగితే పాకిస్థాన్ ఇక ఏడారే..!

కాబూల్: జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో 2025, ఏప్రిల్ 18న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. పహల్గాంలోని పచ్చని ప్రకృతి అందాలు తిలకిద్దామని వచ్చిన పర్యాటకులపై ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ టెర్రర్ ఎటాక్‎లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇండియా.. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్‎కు తగిన బుద్ధి చెప్పేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు పాకిస్తాన్‎తో సింధూ నది జలాల ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసుకుంది. దీంతో పాక్‎లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆప్ఘానిస్తాన్‎తో కూడా కయ్యానికి కాలు దువ్వింది పాకిస్తాన్. ఫలితంగా ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగాయి. ఆప్ఘాన్‎పై పాక్ దాడి చేయగా.. పాక్‎పై ఆప్ఘాన్ కౌంటర్ ఎటాక్ చేసింది. ఈ దాడుల్లో ఇరుదేశాలు భారీగా ప్రాణ నష్టం చవిచూశాయి. పాక్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆప్ఘాన్‎లోని తాలిబన్ ప్రభుత్వం దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పాలని చూస్తోంది.

ఈ క్రమంలోనే ఇండియా బాటలో నడిచేందుకు సిద్ధమైంది. ఇండియా సిందూ నది జలాల ఒప్పందం రద్దు చేసిన మాదిరిగానే పాక్‎పై నీటి ఆంక్షలు విధించి దెబ్బకొట్టాలని ఆప్ఘాన్ భావిస్తోంది. ఈ మేరకు తాలిబన్ సుప్రీం లీడర్ మౌలావి హిబతుల్లా అఖుంద్జాదా కీలక నిర్ణయం తీసుకున్నారు. కునార్ నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించి పాకిస్తాన్‌కు నీటిని పరిమితం చేయాలని ఆఫ్ఘన్ జల, ఇంధన మంత్రిత్వ శాఖను ఆయన ఆదేశించారు. 

ఈ విషయాన్ని ఆప్ఘాన్ జల, ఇంధన మంత్రిత్వ శాఖ గురువారం (అక్టోబర్ 23) సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘‘కునార్ నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించి నది నీటిని పాక్‎కు పరిమితం చేయాలని అలాగే దేశీయ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని సుప్రీం లీడర్ అఖుండ్జాదా ఆదేశించారు’’ అని జల, ఇంధన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

 కాగా, సిందూ నది జలాల ఒప్పందం రద్దుతో ఇప్పటికే నీటి సంక్షోభంతో అల్లాడిపోతున్న పాకిస్తాన్‎.. తాజాగా ఆప్ఘాన్ తీసుకున్న నిర్ణయంతో ఏడారిగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటు ఇండియా.. అటు ఆప్ఘాన్ రెండు వైపులా నుంచి నీళ్లు బంద్ అయితే.. పాక్ నీళ్లు లేక గిలగిలకోట్టుకోవాల్సి వస్తోంది. 

కునార్ నది వివరాలు:

480 కి.మీ పొడవున్న కునార్ నది ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ పర్వతాలలో పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న బ్రోగిల్ పాస్ సమీపంలో జన్మిస్తుంది. ఈ నది కునార్, నంగర్హార్ ప్రావిన్సుల గుండా దక్షిణం వైపు ప్రవహించి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‎లోకి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి జలాలాబాద్ నగరానికి సమీపంలో కాబూల్ నదిలో కలుస్తుంది. కాబూల్ నది అటాక్ సమీపంలో సింధు నదిలో కలుస్తుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు ఈ నది చాలా ముఖ్యమైనది. కునార్ నది నీటి ప్రవాహం తగ్గడం సింధు నదిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తద్వారా పంజాబ్‌ను కూడా దెబ్బతీస్తుంది.