డీప్ ఫేక్ టెక్నాలజీ... ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. డేంజర్ లో రాజకీయ నాయకులు

డీప్ ఫేక్ టెక్నాలజీ... ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. డేంజర్ లో రాజకీయ నాయకులు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మందన్న ఇటీవలి డీప్‌ఫేక్ వీడియోనే అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అయితే ఈ సోషల్ మీడియా ప్రమాదానికి బలైంది ఈమె ఒక్కరే కాదు. మరికొందరికి కూడా ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ అండ్ సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ టెక్నాలజీకి బలయ్యారు. నలుపు రంగు దుస్తులు ధరించి, ఎలివేటర్ నుంచి బయటికి వెళుతున్న AI- రూపొందించిన ఈ వీడియోతో చాలా మంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఇది నిజం కాదని..  ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జరా పటేల్ ను రష్మిక ముఖంతో రీప్లేస్ చేశారని కొన్ని క్షణాల్లోనే గుర్తించారు.

ఇప్పుడు, తెలంగాణా ఎన్నికలు 2023కి ముందు, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఈ టెక్నాలజీకి బలైపోయాడు. ప్రముఖ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.సీఎం కేసీఆర్ రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడి డీప్‌ఫేక్ పరువు నష్టం కలిగించే, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఇందులో చూపిస్తోంది. ఆయన మాత్రమే కాదు, డీప్‌ఫేక్‌లు ఈ ఎన్నికల సీజన్‌లో తెలంగాణలో ఒక పోల్ ప్రాక్టీస్‌గా మారాయి.

రేవంత్ రెడ్డి తర్వాత, బీఆర్ఎస్ నాయకుడు, మంత్రి మల్లా రెడ్డి డీప్‌ఫేక్ AI రూపొందించిన వీడియోలో డ్యాన్స్ చేస్తూ, రాబోయే తెలంగాణా ఎన్నికలు 2023లో “కేసీఆర్‌కి ఓటు వేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి” అని చెప్పడం కనిపించింది. మరో డీప్‌ఫేక్ వీడియోలో, కాంగ్రెస్ ఓట్లు చీలిపోకుండా గతంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్న వైఎస్ఆర్ తెలంగాణ చీఫ్ వైఎస్ షర్మిల, ఆసుపత్రి బెడ్‌పై పడుకుని పొగాకు వాడకం గురించి ప్రజలను హెచ్చరించడం కనిపించింది.

ఈ మార్ఫింగ్ చేసిన వీడియోలు, డీప్‌ఫేక్‌ల ప్రమాదాల గురించి చర్చించడానికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియాకు వెళ్లారు. ఈ తరహా AI సాంకేతికతలను ఉపయోగించి తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను ఎలా వ్యాప్తి చేయవచ్చన్న అంశాలపై చర్చించారు.