యాదాద్రి బెల్లం లడ్డు..ఆమోదం తర్వాతే అమ్మకం

యాదాద్రి బెల్లం లడ్డు..ఆమోదం తర్వాతే అమ్మకం

యాదగిరికొండ, వెలుగు: యాదాద్రి దేవస్థానంలో నమూనా బెల్లం లడ్డూలను గురువారం తయారు చేశారు.  చక్కెరతో తయారుచేసిన లడ్డూలు వద్దనుకునేవారికి బెల్లం లడ్డూలు పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా పనులు ప్రారంభించారు. లడ్డూలకు అవసరమయ్యే దిట్టం నిర్ణయించేందుకు ఇటీవలే ఓ కమిటీ వేశారు. లడ్డూ పరిమాణం, ఖర్చు, సంఖ్య, నిల్వ వంటి అంశాలతో నివేదిక తయారు చేసిన ఈ కమిటీ.. ప్రాథమిక పరిశీలన కోసం100 గ్రాముల పరిమాణంతో రెండు ట్రేల్లో లడ్డూలు తయారు చేసి వాటిని ఉన్నతాధికారుల పరిశీలనకు పంపారు. ఆలయ ముఖ్య అర్చకులు కారంపూడి నర్సింహాచార్యులు, నల్లంధీఘల్ నర్సింహాచార్యులు, దేవస్థాన పాచక స్వామితోపాటు మరో ఏడుగురు సహాయ పాచకులు, సహాయ కార్యనిర్వహణాధికారులు, గోదాం, ప్రసాద విక్రయ పర్యవేక్షకులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ఇలా తయారీ

శనగపిండి మిశ్రమాన్ని వేడి నెయ్యిలో చల్లి బూందీ తయారు చేస్తారు. మరోచోట బెల్లం పానకం తయారు చేసి ఫిల్టర్‌ చేస్తారు. దీన్ని మరోసారి వేడిచేసి ముదురు పానకం వచ్చాక బూందీ కలిపి మిశ్రమం సిద్ధం చేస్తారు. దానికి తగిన పరిమాణంలో కిస్మిస్‌, కాజు, యాలకులు, పచ్చకర్పూరం, జాజికాయ పొడి కలిపి లడ్డూ తయారు చేస్తారు.   బెల్లంతో లడ్డూలు తయారు చేయడానికి ఖర్చు, వాటి పరిమాణం, పెరిగే పనిభారం వంటి అంశాలపై నివేదికను దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపనున్నారు.