కాంగ్రెస్ లో కమిటీల లొల్లి.. రెండు సార్లు ఆర్డర్లిస్తున్న పీసీసీ

కాంగ్రెస్ లో కమిటీల లొల్లి.. రెండు సార్లు ఆర్డర్లిస్తున్న పీసీసీ

కాంగ్రెస్ లో కమిటీల లొల్లి
రెండు సార్లు ఆర్డర్లిస్తున్న పీసీసీ
స్థానిక నేతల గాంధీభవన్ బాట
తమ పేర్లు లేవంటూ ఆవేదన
ఖానాపూర్ సెగ్మెంట్ లో రెండు ఆర్డర్లు
మహేశ్ కుమార్ గౌడ్ ఆర్డర్ ను మార్చి మళ్లీ ఇచ్చిన మల్లు రవి
మల్లురవికి ఏఐసీసీ షోకాజ్ నోటీసు 

కర్నాటక గెలుపు తర్వాత ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీలో కమిటీల లొల్లి షురువైంది. ఇటీవల పీసీసీ ప్రకటించిన మండల, టౌన్ కమిటీల్లో తమ పేర్లు లేవంటూ స్థానిక నాయకులు అలకబూనారు. కొందరు ఏకంగా గాంధీభవన్ కే తరలిరావడం గమనార్హం. అసంతృప్తులను చల్లబర్చేందుకు పీసీసీ రెండు సార్లు ఆర్డర్లు ఇవ్వడం కొత్త గందరగోళానికి దారి తీసింది. ఇంతకూ పదవులు వచ్చింది ఎవరికి..? అని ఆయా మండలాలకు చెందిన ఇద్దరు నేతలు జుట్లు పీక్కుంటున్నారు. రాష్ట్రంలోని సగానికిపైగా నియోజకవర్గాల్లో ఈ రచ్చ కొనసాగుతుండటం గమనార్హం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ సెగ్మెంట్ పరిధిలోని మండలాధ్యక్షుల నియమాకం మరింత వివాదాస్పదంగా మారింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ నెల 4న నూతన మండల అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరుసటి రోజు ( జూలై7న) పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మరో జాబితాను విడుదల చేశారు. ఖానాపూర్, జన్నారం టౌన్, ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల అధ్యక్షులను మల్లు రవి మార్చడం వివాదాస్పదంగా మారింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఏఐసీసీ షోకాజ్ నోటీ జారీ చేసింది. ఈ తరహా ఆర్డర్లు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, సూర్యాపేట, మునుగోడు, సిద్దిపేట, ఖానాపూర్, మహేశ్వరం, వరంగల్ ఈస్ట్, వెస్ట్, జనగాం, ఎల్బీనగర్, భువనగిరి, ఆలేరు, ఇబ్రహీం పట్నం, పాలకుర్తి, ముషీరాబాద్ సెగ్మెంట్లలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

చలో గాంధీ భవన్

పదవులు రాని వారంతా గాంధీభవన్ బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. పార్టీ కోసం తాము ఎంతో శ్రమిస్తున్నామని, తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా డీసీసీ అధ్యక్షులనే మార్చాలనే డిమాండ్ సైతం తెరపైకి వస్తుండటం గమనార్హం. భువనగిరి డీసీసీ అధ్యక్షుడు అనిల్ రెడ్డిని, సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ నర్సారెడ్డిని మార్చాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

మల్లు రవికి షోకాజ్ నోటీస్

పార్టీ మండల కమిటీల విషయంలో రెండో సారి ఆర్డర్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని, దీనికి రాత పూర్వక వివరణ ఇవ్వాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లురవికి ఏఐసీసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆర్డర్ కాపీని కాదని ప్రత్యేకంగా ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారో తెలపాలని పేర్కొంది.