
- అమెరికాకు 2.71 కోట్ల యూనిట్ల ఎగుమతులు
- కెనాలిస్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: మనదేశం ఈ ఏడాది రెండో క్వార్టర్లో (ఏప్రిల్-–జూన్) మొదటిసారిగా అమెరికాకు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ఎగుమతిదారుగా నిలిచింది. చైనా వాటా తగ్గడంతో ఈ స్థానాన్ని సాధించిందని కెనాలిస్ తెలిపింది. ఇది విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. అమెరికా, -చైనా మధ్య సుంకాల చర్చలు, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మార్పు జరిగింది. అమెరికాకు స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు ఈ క్వార్టర్లో ఒకశాతం పెరిగి మొత్తం 2.71 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయి.
చైనా ఎగుమతుల వాటా గత ఏడాది 61శాతం నుంచి 25శాతానికి పడిపోయింది. మనదేశంలో తయారైన స్మార్ట్‌ఫోన్‌ల వాటా 13శాతం నుంచి 44శాతానికి భారీగా పెరిగింది. ఇది 240శాతం వార్షిక వృద్ధి సాధించింది. ఈ మార్పుకు ప్రధాన కారణం ఆపిల్ తన ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశంలో వేగంగా విస్తరించడమే. చైనా ప్లస్ వన్ వ్యూహంలో భాగంగా ఆపిల్ మనదేశంలో భారీగా ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ తయారయ్యే ఫోన్ల లో ఎక్కువ భాగాన్ని అమెరికాకు పంపుతోంది.
మొదటిస్థానంలో ఆపిల్
ఈ క్వార్టర్లో ఆపిల్ ఐఫోన్ షిప్‌మెంట్లు 11శాతం తగ్గి 13.3 మిలియన్ యూనిట్లకు చేరగా, శామ్‌సంగ్ 38శాతం వృద్ధితో 8.3 మిలియన్ యూనిట్లు షిప్ చేసింది. మోటరోలా 2శాతం వృద్ధితో 3.2 మిలియన్ యూనిట్లు, గూగుల్ 13శాతం వృద్ధితో 0.8 మిలియన్ యూనిట్లు పంపింది. టీసీఎల్ ఎగుమతులు 23శాతం తగ్గి 0.7 మిలియన్ యూనిట్లకు పడిపోయాయి. అమెరికా–-చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆపిల్ భారతదేశంలో ఉత్పత్తిని వేగవంతం చేయడం వల్ల భారతదేశం మొదటిసారిగా అమెరికాకు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ఎగుమతిదారుగా నిలిచిందని కెనాలిస్ ఎనలిస్ట్ సన్యం చౌరాసియా తెలిపారు. భారతదేశం నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల విలువ ఈ క్వార్టర్లో రూ. 700 కోట్లను దాటింది. ఇది 40శాతం వార్షిక వృద్ధిని సూచిస్తుంది. ఫాక్స్‌కాన్, టాటా, ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలు భారతదేశంలో ఆపిల్ఫోన్ల ఉత్పత్తిని పెంచుతున్నాయి. దీనివల్ల భారతదేశం గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మానుఫ్యాక్చరింగ్ హబ్‌గా నిలుస్తోంది. ---