అగ్నిపథ్ ఆర్మీ వ్యవస్థను నాశనం చేస్తుంది

అగ్నిపథ్ ఆర్మీ వ్యవస్థను నాశనం చేస్తుంది
  • కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ డిమాండ్
  • ఆర్మీ వ్యవస్థను బలహీనం చేస్తున్నరు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆర్మీ బలగాలను బలహీనం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. జాతీయవాద పార్టీ అని చెప్పుకునే బీజేపీ.. అగ్నిపథ్ పథకం ద్వారా సాయుధ బలగాల బలాన్ని తగ్గిస్తోందని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నట్టుగానే అగ్నిపథ్​ను కూడా వాపస్ తీస్కోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాహుల్ మాట్లాడారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ గురించి మాట్లాడేవాళ్లు ఇపుడు నో ర్యాంక్, నో పెన్షన్ విధానం తెస్తున్నారని ఫైర్ అయ్యారు. సెక్యూరిటీ ఫోర్సెస్​లో చేరడానికి ట్రైనింగ్ తీసుకుంటున్న యువకుల చివరి దారిని ప్రధాని నరేంద్ర మోడీ మూసేశారని మండిపడ్డారు. చైనీస్ సైన్యం ఓ వైపున మన గడ్డపై కూర్చొని ఉంటే.. మన సైన్యాన్ని కేంద్ర సర్కారు నాశనం పట్టిస్తోందని అన్నారు. సైన్యానికి, దేశానికి ఈ సర్కారు చేస్తున్న కొత్త వంచన, ద్రోహంపై కొట్లాడేందుకు కాంగ్రెస్ ముందుంటుందని రాహుల్ చెప్పారు. 

ఈడీ అధికారులు ఆశ్చర్యపోయిన్రు

నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీల్యాండరింగ్ కేసులో ఈడీ తనను 5 రోజుల్లో 50 గంటలకుపైగా ప్రశ్నించిందని, అన్నింటికీ సమాధానమిచ్చానని రాహుల్ చెప్పారు. చివరి రోజు ప్రశ్నిస్తున్నప్పుడు 11 గంటలకుపైగా కుర్చీలో కూర్చునే ఉన్నానని చెప్పారు. దీంతో తనను చూసి దర్యాప్తు అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారన్నారు. ఇంత ఓపిక వెనుక మీ సీక్రెట్ ఏంటని ఆరా తీశారని రాహుల్ వివరించారు. ‘‘తొలుత వాళ్లకు చెప్పొద్దనుకున్నా కానీ, విపాసన యోగా చేస్తానని చెప్పాను. అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్​పార్టీ మమ్మల్ని అలసిపోనివ్వదు. స్వేచ్ఛకోసం, ప్రజా సమస్యలపై కొట్లాడేందుకు అది మాకు ఓపికను అందిస్తుంది. ఈడీ అధికారులతో కూర్చున్నప్పటికీ నేను ఒంటరిగా ఫీల్ కాలేదు. ప్రజాస్వామ్యం కోసం పోరాడే కాంగ్రెస్ కార్యకర్తలంతా నాతో ఉన్నారు”అని రాహుల్ గాంధీ చెప్పారు.