అగ్ని 5 పరీక్ష విజయవంతం .. మిషన్  దివ్యాస్త్రలో మొదటి ఫ్లైట్ టెస్ట్

అగ్ని 5 పరీక్ష విజయవంతం .. మిషన్  దివ్యాస్త్రలో మొదటి ఫ్లైట్ టెస్ట్
  • డీఆర్డీవో సైంటిస్టులకు ప్రధాని అభినందనలు
  • పరీక్ష సమయంలో విశాఖ సమీపంలో చైనా నౌక తిష్ట

ఒకే మిసైల్​కు పలు వార్ హెడ్స్ అమర్చి, ఏక కాలంలో వేర్వేరు ప్రదేశాల్లోని టార్గెట్స్​ను ఛేదించే సామర్థ్యం ఉన్న అగ్ని 5 క్షిపణిని భారత్  విజయవంతంగా పరీక్షించింది. సోమవారం ఒడిశాలోని బాలాసోర్​లో ఈ పరీక్ష నిర్వహించారు. ఎంఐఆర్​వీ టెక్నాలజీతో దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని 5 మిసైల్స్​లో ఇది మొదటి ఫ్లైట్ టెస్ట్. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనాకు మాత్రమే ఉంది. శత్రు దేశాల ఆయుధాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించేలా ఈ మిసైల్​ను అభివృద్ధి చేశారు. అగ్ని 5 పరీక్ష విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ.. డీఆర్డీవో సైంటిస్టులకు అభినందనలు తెలిపారు.

న్యూఢిల్లీ : దేశీయంగా రూపొందించిన అగ్ని 5 మిసైల్ ను విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్డీవో సైంటిస్టులు సోమవారం వెల్లడించారు. ఈ మిసైల్ ను తొలిసారిగా ‘మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్​ రీఎంట్రీ వెహికల్​(ఎంఐఆర్ వీ) తో టెస్ట్ చేసినట్లు తెలిపారు. మిషన్ దివ్యాస్త్రలో భాగంగా ఒడిసాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి అగ్ని 5 ప్రయోగం చేపట్టామని చెప్పారు. మిసైల్ లోని ఎంఐఆర్ వీ టెక్నాలజీని పరీక్షించేందుకు నిర్ణయించిన అన్ని పారామీటర్లను అగ్ని 5 విజయవంతంగా పూర్తిచేసిందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఏమిటీ ఎంఐఆర్​వీ..

ఒకే మిసైల్​కు ఒకటికంటే ఎక్కువ వార్ హెడ్ లను అమర్చి, వాటితో వేర్వేరు లక్ష్యాలను ఛేదించే సామర్థ్యమే ఎంఐఆర్ వీ అని, ప్రస్తుతం ప్రపంచంలోని అతికొద్ది దేశాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉందని వివరించారు. అమెరికా, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉందని, తాజా పరీక్షతో ఈ దేశాల సరసన భారత్​ చేరిందని పేర్కొన్నారు. 

శాస్త్రవేత్తలకు మోదీ అభినందన

ఎంఐఆర్ వీ సామర్థ్యంతో అగ్ని 5 మిసైల్​ను విజయవంతంగా పరీక్షించిన సైంటిస్టులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మన సైంటిస్టులను చూసి గర్విస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

మిసైల్​ విశేషాలు..

అగ్ని 5 మిసైల్​ రేంజ్ 5 వేల కిలోమీటర్లు.. దీంతో ఆసియా ఖండంలో ఏ ప్రాంతంలోని టార్గెట్ అయినా ఛేదించవచ్చు. నార్తర్న్ చైనాలో చాలా వరకు, యూరప్​లోని పలు రీజియన్లు కూడా అగ్ని 5 మిసైల్ స్ట్రైకింగ్​ రేంజ్​లోనే ఉంటాయని రక్షణ శాఖ వెల్లడించింది. అగ్ని 5 మిసైల్ ను గతంలో చాలాసార్లు విజయవంతంగా పరీక్షించామని సైంటిస్టులు తెలిపారు. అయితే, ఎంఐఆర్ వీ ఫీచర్ తో పరీక్షించడం మాత్రం ఇదే మొదటిసారి అని వివరించారు.

కిందటి వారంలోనే నోటమ్​.. విశాఖ దగ్గర్లో చైనా నౌక

అగ్ని 5 మిసైల్  పరీక్ష సమయంలో చైనా నౌక విశాఖపట్నం సముద్ర తీరానికి సమీపంలో తిష్టవేసింది. ఒడిశా తీరంలో తాము మిసైల్  పరీక్ష నిర్వహించనున్నామని భారత్  కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఈ మేరకు గత వారం నోటమ్  (నోటీస్ టు ఎయిర్ మెన్) అలర్ట్  జారీచేసింది. ఒక ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించినపుడు నోటమ్  అలర్ట్ లు జారీచేస్తారు.  ఈ నెల 11 నుంచి 16 మధ్య తాము ఎప్పుడైనా మిసైల్  టెస్టు చేస్తామని ఆ అలర్ట్ లో ఇండియా స్పష్టం చేసింది. అయినప్పటికీ విశాఖ తీరానికి 480 కిలోమీటర్ల (260 నాటికన్  మైళ్లు) కన్నా తక్కువ దూరంలో చైనాకు చెందిన షియాన్  యాంగ్  హాంగ్ 01 నౌక ప్రవేశించింది. ఈ జలాల పరిధిలోనే మన దేశానికి చెందిన 3 న్యూక్లియర్  పవర్డ్  బాలిస్టిక్  సబ్ మెరైన్లు ఉన్నాయి. మన దేశ మిసైల్  టెస్టులను చైనా గత కొద్ది రోజులుగా గమనిస్తున్నది.