ఇజ్రాయిల్పై హమాస్ దాడికి..అమెరికా ‑ ఇరాన్ ఒప్పందమే కారణమా?

ఇజ్రాయిల్పై హమాస్ దాడికి..అమెరికా ‑ ఇరాన్ ఒప్పందమే కారణమా?

న్యూఢిల్లీ: పాలస్తీనా టెర్రరిస్ట్ గ్రూప్ హమాస్.. ఇజ్రాయెల్​పై దాడి వెనుక అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందమే పరోక్ష కారణమనే చర్చ జరుగుతోంది. ఖైదీలను ఇచ్చిపుచ్చుకునేందుకు ఇరు దేశాల నడుమ జరిగిన 6 బిలియన్ డాలర్ల(రూ.49 వేల కోట్లు) డీల్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ డీల్​పై యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సెప్టెంబర్​లోనే సంతకాలు చేశారు. అందుకు ఇరాన్ చేతిలో బందీలుగా ఉన్న ఐదుగురు అమెరికన్ల విడుదలకు లైన్ క్లియర్ చేసుకున్నారు. అయితే, ఆరు బిలియన్ డాలర్లతోనే ఇజ్రాయెల్​పై దాడికి హమాస్​ను ఇరాన్​ ప్రోత్సహించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

అసలెక్కడివీ నిధులు? 

2019లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చమురు ఎగుమతులు, బ్యాంకింగ్ రంగంపై ఆంక్షలు విధించారు. దీంతో ఇరాన్ చమురు ఆదాయాలు 6 బిలియన్ డాలర్లు కొరియన్ బ్యాంకుల్లో చిక్కుకుపోయాయి. అవి అప్పటినుంచి అలాగే ఉండిపోయాయి. ఈ ఆరు బిలియన్ల కోసం ఇరాన్ అమెరికా మధ్య ఇటీవలే కీలక ఒప్పందం జరిగింది. ఈ ఫండ్స్​ను క్లియర్ చేయాలంటే ఇరాన్ జైళులో ఉన్న ఐదుగురు అమెరికన్లను విడుదల చేయాలని బైడెన్  డిమాండ్ చేశారు.

 అందుకు, అమెరికా ఆధీనంలో ఉన్న ఐదుగురు ఇరానియన్ ఖైదీలను కూడా విడిచిపెట్టాలని ఇరాన్ కండిషన్ పెట్టింది. దీనికి ఇరు దేశాలు ఓకే చెప్పుకోగా డీల్​పై సెప్టెంబర్​లో బైడెన్ సంతకం చేశారు. అయితే, ఇంతకాలం స్తబ్దుగా ఉన్న నిధులను ఇరాన్​కు విడుదల చేయడం ద్వారా బైడెన్ పరోక్షంగా హమాస్​కు మద్దతు ఇచ్చినట్లయిందని యూఎస్ రిపబ్లికన్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ నిధులను హమాస్​ టెర్రరిస్టులకు ఇరాన్ అందజేసిందని ఆరోపిస్తున్నారు.

 ఈ ఆరోపణలను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఖండించారు. ఆ నిధులు ఇప్పటికీ.. డీల్​కు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్​ హాండోవర్​లోనే ఉన్నాయని అంటున్నారు.