
- వృథాగా రూ.50 లక్షల విలువైన అగ్రి మెషీన్లు
- రూర్బన్స్కీం కింద 2020 జూలైలోనే పాపన్నపేటకు చేరిన మెషీన్లు
- తుప్పు పడుతున్నా పట్టించుకోని ఆఫీసర్లు
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో రూర్బన్ స్కీం కింద కొనుగోలు చేసిన సాగు యంత్రాలు వృథాగా ఉన్నాయి. రెండేండ్లు కావస్తున్నా ఆ మెషీన్లను వినియోగించకపోవడంతో తుప్పుపట్టి పోతున్నాయి. లక్షల రూపాయలు పెట్టి కొన్న యంత్రాలు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పాడవుతున్నాయని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాడుకలోకి తేవాలని కోరుతున్నారు.
మెదక్, పాపన్నపేట, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్య, వ్యవసాయరంగాల్లో సదుపాయాలు మెరుగు పర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో ఎంపిక చేసిన క్లస్టర్లలో ఈ స్కీంను అమలు చేస్తుండగా, రూర్బన్ మూడో ఫేజ్లో మెదక్ జిల్లా పాపన్నపేట మండలాన్ని సెలక్ట్ చేశారు. ఈ స్కీం కింద మండలానికి మొత్తం రూ.30 కోట్లు శాంక్షన్ అయ్యాయి. పాపన్నపేట మండలంలోని రైతుల అవసరాలకు వివిధ వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేసేందుకు రూ.50 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో మూడు వరినాటే యంత్రాలు, నాలుగు విత్తనాలు, ఎరువులు వేసే యంత్రాలు, రెండు మక్కల నూర్పిడి యంత్రాలు, నాలుగు గడ్డి కట్టే యంత్రాలు, ఒక ట్రాక్టర్, 8 గడ్డి కోసే మెషీన్లు, 10 తైవాన్ స్ప్రేయర్లు కొనుగోలు చేశారు. ఇవి 2020 జులైలోనే పాపన్నపేటకు చేరాయి.
కస్టమర్సెంటర్ఏర్పాటు చేయలే..
రూర్బన్ స్కీం కింద కొనుగోలు చేసిన వ్యవసాయ యంత్రాల మెయింటెనెన్స్ కోసం అగ్రికల్చర్ ఆఫీసర్లు, జిల్లా రైతు సమన్వయ కమిటీ కలిసి 11 మందితో ఒక కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ ఆధ్వర్యంలో కస్టమర్ సెంటర్ ఏర్పాటు చేసి, అవసరం ఉన్న రైతులకు యంత్రాలను కిరాయికి ఇవ్వాలి. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని యంత్రాల మెయింటెనెన్స్కు, సిబ్బంది జీతాలకు ఉపయోగించాలి. కాగా యంత్రాలు కొనుగోలు చేసి, కమిటీ ఏర్పాటు చేసి ఏడాదిన్నర గడిచినా ఇంత వరకు కస్టమర్సెంటర్ఏర్పాటు చేయలేదు.
ప్రారంభంలో ట్రాక్టర్ తోపాటు, రెండు, మూడు యంత్రాలను కొందరు రైతులకు కిరాయికి ఇచ్చారు. కానీ మిగతా యంత్రాల గురించి పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆ యంత్రాలు పాపన్నపేటలోని ఓ ఫంక్షన్ హాల్ లో వృథాగా పడి ఉన్నాయి. 2020 వానాకాలం సీజన్లో తెచ్చిన యంత్రాలు 2022 ఖరీఫ్ సీజన్ మొదలైనా ఇంతవరకు ఆ యంత్రాలను వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో అవి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పుపట్టి పోతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఆఫీసర్లు స్పందించి వెంటనే ఆ మెషీన్లను వాడుకలోకి తేవాలని పలువురు రైతులు కోరుతున్నారు.