జోరుగా వరి సాగు.. వర్షాలతో ఎవుసం పనుల్లో రైతన్న బిజీబిజీ

జోరుగా వరి సాగు.. వర్షాలతో ఎవుసం పనుల్లో రైతన్న బిజీబిజీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఈ వానాకాలం సీజన్‌‌‌‌లో పత్తి సాగు భారీగా పడిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. సీజన్‌‌‌‌  ఆలస్యం కావడంతో జూన్‌‌‌‌  ప్రారంభంలో  చేయాల్సిన పత్తి సాగు బాగా పడిపోయింది. ఈయేడు ఇప్పటి వరకూ 37 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. సీజన్‌‌‌‌  దాటిపోవడంతో ఇప్పుడు పత్తి సాగు కష్టమేనని రైతులు పేర్కొంటున్నారు. ఇక తాజా వానల నేపథ్యంలో రాష్ట్రంలో వరి సాగు క్రమంగా ఊపందుకుంటున్నది. ఇప్పటికే నార్లు పెరిగిన ప్రాంతాల్లో  రైతులంతా పొలాల్లో నాట్లు షురూ చేశారు. దీంతో ఎవుసం  పనుల్లో రైతులు బిజీ అయ్యారు. వానలతో వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి.

వారం క్రితం 2.95 లక్షల ఎకరాల్లో  నాట్లు పడగా తాజాగా రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల ఎకరాలకు పైగా వరినాట్లు వేసినట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజా వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వరి సాగుతో పాటు మొక్కజొన్న సాగు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో వర్షాధార పంటలకు మేలు జరుగుతున్నది. నిన్న మొన్నటి వరకు విత్తనాలు మొలకలు రాక, వచ్చిన మొలకలు ఎండలకు మాడిపోయి ఇబ్బందులు ఏర్పడుతున్న తరుణంలో ఈ వానలు పునాస పంటల్లో జవసత్వాలు పెంచుతున్నాయి. వర్షాధార పంటలు, పత్తి, మక్క, జొన్న, పెసర తదితర పంటలకు తాజా వానలు మేలు చేస్తున్నాయి.  అయితే ఇప్పుడు సాగు చేయాలంటే కంది, బొబ్బర్లు, కొర్రలు, సన్ ఫ్లవర్,  వేరుసెనగ, ఉలవలు, ఆముదం వంటి పంటలే మంచిదని వ్యవసాయ శాఖ నిపుణులు సూచిస్తున్నారు.

60 లక్షల ఎకరాలు దాటిన వానాకాలం సాగు

గత వారం వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 42.76 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఇప్పుడది 60 లక్షల ఎకరాలకు పెరిగింది. వారం రోజుల్లోనే  వానల ప్రభావంతో సాగు వేగం పుంజుకున్నది. వరినాట్లు జోరందుకోవడంతో సాగు గణనీయంగా పెరుగుతున్నది. ఇప్పటికే సాగైన పంటలకు వానలు తోడవడంతో దాదాపు కరువుకు చేరువవుతున్న పరిస్థితుల్లోంచి సాగు మరింత మెరుగవుతున్నది.