ప్రాజెక్టుల నీళ్లందక పంటలెండుతున్నయ్

ప్రాజెక్టుల నీళ్లందక పంటలెండుతున్నయ్
  • వరి, పల్లీ, మక్క పంటలపై ఎఫెక్ట్
  • కొన్నిచోట్ల  పశువులకు వదిలేస్తున్నరు
  • నెల కిందే కల్వకుర్తి లిఫ్టు బంద్.. 
  • 80 వేల ఎకరాలపై ప్రభావం
  • ఎస్సారెస్పీ, సాగర్ కింద వారబందీతో చివరి భూములకు చేరని నీళ్లు
  • గోదావరి, కృష్ణాపై పనిచేయని లిఫ్టులు
  • వద్దన్నా వరి వేసినందుకే 
  • సర్కారు కక్ష కట్టిందనే ఆరోపణలు!
  • ప్రాజెక్టుల్లో నీళ్లున్నా రిలీజ్ చేయట్లేదని రైతుల ఆవేదన

వెలుగు నెట్‌‌‌‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. కృష్ణా, గోదావరి నదులపై కల్వకుర్తి సహా వివిధ లిఫ్టు స్కీములకు నీళ్లు ఆపేయడం, పలు సాగునీటి ప్రాజెక్టుల కింద వారబందీ పేరిట వారం, పది రోజులపాటు సప్లయ్ బంద్ పెడ్తుండటంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్తున్నారు. ప్రధానంగా వరి, పల్లీ, మక్క పంటలపై ఎఫెక్ట్ పడింది. వరి పంట పొట్టదశలో ఉందని, కనీసం రెండు తడులకైనా నీళ్లు ఇస్తే గట్టెక్కుతామని, లేదంటే ఒక్కో ఎకరాపై రూ.30 వేల దాకా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వద్దంటే వరి వేశామనే కారణంతో తమపై సర్కారు కక్ష కట్టిందని, అందుకే ప్రాజెక్టుల్లో నీళ్లున్నా రిలీజ్​చేయట్లేదని  రైతులు అంటున్నారు. యా జిల్లాల్లో ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులకు రైతులుమొరపెట్టుకుంటున్నా పట్టించుకోకపోవడంతో చాలాచోట్ల పంటపై ఆశలు వదిలేసుకొని పశువులను మేపుకుంటున్నారు.

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 70 వేల ఎకరాలు
కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్ నుంచి నీటి విడుదలను ఆపేయడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వేలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. ముఖ్యంగా నాగర్​కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా నాట్లు వేసిన సుమారు 70 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింటోంది. శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరడంతో ఫిబ్రవరి 15 నుంచే కెనాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నీటి సప్లై బంద్ అయింది. కొల్లాపూర్ ఎమ్మెల్యే ఒత్తిడితో సింగోటం, జొన్నలబొగడ రిజర్వాయర్ల నుంచి కోడేర్, పెద్దకొత్తపల్లి, పానగల్ మండలాలకు కొంతవరకు నీరు ఇస్తున్నారు. కానీ గుడిపల్లి గట్టు రిజర్వాయర్ కింద నాగర్ కర్నూలు, కల్వకుర్తి, జడ్చర్ల, అచ్చంపేట నియోజకవర్గాల పరిధిలోని కాలువలకు నీరు వదలడం లేదు. దీంతో వేలాది ఎకరాల్లో పల్లి, మొక్కజొన్న పంటలు ఎండుతున్నాయి. ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపోవాల్సిన పరిస్థితి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్వకుర్తి మూడో కెనాల్​ ద్వారా నీరు నిలిచిపోవడంతో పాలమూరు జిల్లా మిడ్జిల్ మండలంలోని 8 వేల ఎకరాల్లో వరి ఎండిపోతోంది. ఇదే జిల్లాలోని కోయిల్​సాగర్ లెఫ్ట్ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పది రోజులకోసారి నీళ్లు ఇస్తున్నారు. రిపేర్ల సాకుతో రైట్ కెనాల్​కు కంప్లీట్​గా నీళ్లు బంద్ పెట్టడంతో ధన్వాడ, మరికల్, చిన్నచింతకుంట మండలాల్లో సాగు చేసిన 12 వేల ఎకరాల వరి ప్రమాదంలో పడింది. చివరి తడులకు నీళ్లిచ్చి పంటలు కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. జూరాల ఎడమ కాలువ కింద వారానికి ఒకసారి నీళ్లు వదులుతుండడంతో బోరు బావుల ద్వారా తమ పంటలు కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.

ఎస్సారెస్పీ కింద12 వేల ఎకరాల్లో..
ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని జగిత్యాల జిల్లాలో ఈసారి 2.93 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా సుమారు 2.45 లక్షల ఎకరాల్లో వరి వేశారు. కానీ శ్రీరాంసాగర్ కింద వారబందీ పద్ధతిలో నీళ్లు ఇస్తుండడంతో ఆయకట్టు చివర ఉన్న 12 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. కొడిమ్యాల, సారంగపూర్, కథలాపూర్, మల్యాల, మేడిపల్లి మండలాల్లో ఈ పరిస్థితి నెలకొన్నది. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆధారపడి ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల, ముక్కట్రావ్ పేట్ తదితర గ్రామాల్లోని రైతులు వరి సాగుచేస్తున్నారు. ఈసారి మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నీటిని రిలీజ్ చేస్తుండడంతో డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నీటి మట్టం పడిపోయి బోర్లు వట్టిపోయాయి. దీంతో 900 ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోతున్నాయి. వరద కాల్వ ద్వారా నీటిని బంద్​చేయడంతో ఇప్పటికే 200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎల్లంపల్లి నీటిని బంద్ చేయడంతో లెఫ్ట్ కెనాల్ కింద గంగాధర మండలంలోని వెయ్యి ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. బూరుగుపల్లి, చర్లపల్లి (ఆర్), ర్యాలపల్లి, కొండయ్యపల్లి, కాచి రెడ్డి పల్లి, కొడిమ్యాల మండలం నర్సింహుల పల్లి, మల్యాల మండలం బలవంత పూర్ గ్రామాల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎల్లంపల్లి నీటితో నారాయణపూర్ రిజర్వాయర్ నింపి పంటలు కాపాడాలని రైతులు ఆందోళన చేస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.

లిఫ్టులు బందై.. కెనాల్స్ దెబ్బతిని..
కొన్నిచోట్ల లిఫ్టులు బంద్​కావడం, ఇంకొన్ని చోట్ల కెనాల్స్ బాగా లేక ఆయకట్టుకు నీళ్లందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కాసిపేట – వెల్గనూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిరుడు జులై, సెప్టెంబర్ మధ్య మూడుసార్లు గోదావరి వరదల్లో మునిగిపోయింది. పైపు లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, కరెంట్ పోల్స్ దెబ్బతిన్నాయి. రూ.8 లక్షలతో రిపేర్లు మొదలు పెట్టారు. ఆఫీసర్లు రిపేర్లు చేస్తారనే నమ్మకంతో రైతులు పంటలు సాగుచేశారు. కానీ కాంట్రాక్టర్, ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల ఆరు నెలలు దాటినా పనులు కాలేదు. దీంతో నీళ్లు లేక ఆయకట్టు కింద కాసిపేటలో 400, వెల్గనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 200 ఎకరాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే సుమారు 200 ఎకరాల్లో పొలాలు నెర్రెలు కొట్టాయి. వారం రోజుల్లో నీళ్లు ఇయ్యకుంటే పంటలు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని వన దుర్గా ప్రాజెక్ట్ (ఘనపూర్ ఆనకట్ట) కింద వారబందీ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీళ్లు ఇస్తున్నారు. కానీ కాల్వలు బాగా లేక చివరి వరకు వెళ్లడం లేదు. పాపన్నపేట మండలంలోని ఫతే నహర్ బ్రాంచ్ కెనాల్ ఏకంగా 27 కిలోమీటర్లు దెబ్బతిని, తూములు ధ్వంసమైనా రిపేర్లు చేయించలేదు. ఫలితంగా మూడు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని బోనకల్లు బ్రాంచి కెనాల్​కు ఆఫీసర్లు నీటిని నిలిపివేయడంతో ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని ఐదు గ్రామాల్లో 2 వేల ఎకరాలకు నీళ్లందడం లేదు. బోనకల్లు బ్రాంచి కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 1,200 క్యూసెక్కుల నీటిని వదలాల్సి ఉండగా, 800 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేసి, తర్వాత ఆపేయడంతో వరి, మొక్కజొన్న పంటలు ఎండుతున్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలోని వివిధ లిఫ్టు స్కీములు బంద్​పెట్టడంతో వందలాది ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోతున్నాయి. కృష్ణ , భీమ్లా తండాలకు చెందిన సుమారు 220 ఎకరాల్లో వరి ఇప్పటికే పనికిరాకుండా పోవడంతో రైతులు పశువులను తోలుతున్నారు.

8 ఎకరాలు ఎండిపోయేట్టున్నయ్
నాకు ఎనిమిదెకరాల భూమి ఉంది. ప్రతిసారి మార్చిలో నారాయణపూర్ ఎడమ కాలువ నుంచి సాగునీరు ఇచ్చెటోళ్లు. ఈసారి కూడా నీళ్లు వస్తయన్న ఆశతో మొత్తం వరి పంటనే వేసిన. బావిలో నీళ్లు లేక ఇప్పటికే రెండెకరాలు ఎండిపోయినయ్. మిగతా ఆరెకరాలు ఇంకో 10 రోజుల్లో ఎండిపోతయ్. నీళ్లియ్యమని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు.
- ఎట్టెపు అజయ్, చర్లపల్లి (ఆర్), గంగాధర మండలం, కరీంనగర్

10 ఎకరాల్లో పంట ఎండిపోయింది
మొత్తం 15 ఎకరాల్లో పల్లి పంట వేసిన. కాలువ నీళ్లు బంద్ కావడంతో పది ఎకరాల్లో పంట ఎండిపోయింది. నాకున్న రెండు బోర్లతో మిగిలిన 5 ఎకరాలకు నీళ్లు పారిస్తున్న. 10 ఎకరాల్లో పంట దెబ్బతిని రూ.రెండు లక్షల పెట్టుబడి నష్టం మీద పడింది.
- రాములు, గోదల్, నాగర్​కర్నూల్ జిల్లా

పశువులకు మేతగా వేస్తున్న
కాలువ దగ్గర మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని జొన్నలు, మక్కలు కలిపి వేసిన. రూ.50 వేలు ఖర్చు పెట్టిన.  నీళ్లు లేక మక్క చేను ఎండిపోయింది. దీంతో పశువులకు మేతగా వేస్తున్న. 
‑ పోసరి వెంకటయ్య, పాలెం, నాగర్​కర్నూల్​