ఐటీ రంగంలో ఉద్యోగుల మెడపై లే-ఆఫ్స్ కత్తి వేలాడుతోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే.. 2025లో ఇప్పటిదాకా లక్షా 12 వేల 732 మంది ఐటీ ఉద్యోగుల కొలువులు ఊడిపోయాయి. ఇదేదో.. అంచనా వేసి చెబుతున్న లెక్క కాదు. Layoffs.fyi అఫిషియల్ డేటా చెప్పిన లేఆఫ్స్ కౌంట్ ఇది. 218 టెక్ కంపెనీలు లక్ష మందికి పైగా ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సదరు లే-ఆఫ్స్ ట్రాకింగ్ సైట్ తెలిపింది.
ప్రస్తుతం ఐటీ రంగంలో ఏఐ వినియోగం విపరీతంగా పెరగడమే ఇంత మంది ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఏఐ వినియోగం పెరగడం, ఖర్చులు తగ్గించుకోవాలనే భావనలో ఉన్న కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రాజెక్టులు లేవంటూ ఎంప్లాయిస్ను పక్కకు పెడుతున్నాయి.
ఒక్క అమెజాన్ కంపెనీనే 14 వేల మంది ఉద్యోగులను 2025 సంవత్సరంలో ఇప్పటివరకూ ఉద్యోగాల నుంచి తొలగించిందంటే ఐటీ ఉద్యోగులకు ఏఐ ముప్పు ఎంతలా పొంచి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంటెల్ కంపెనీ కూడా 24 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. టీసీఎస్ కంపెనీ కూడా ఇంచుమించు 20 వేల ఉద్యోగాలకు మంగళం పాడింది. యాక్సెంచర్ కంపెనీ కూడా తక్కువేం తినలేదు. వేల మంది ఉద్యోగులను కొలువుల్లోంచి పీకేసింది. మైక్రోసాఫ్ట్ కూడా 9 వేల ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. సేల్స్ ఫోర్స్ 4 వేల సపోర్ట్ జాబ్స్ను ఏఐ కస్టమర్ సర్వీస్తో రీప్లేస్ చేసింది.
ప్రస్తుతం ఐటీ రంగంలో ఏఐ వినియోగం పెరిగింది. హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. దాదాపు 2 వేల ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఐటీ ఎక్స్‌పోర్ట్స్‌లో రాష్ట్రమే టాప్లో ఉన్నది. నిరుడు 2.7 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. ఈ కారణంగానే బెంగళూరుతో పోటీపడి హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు పెరిగాయి.
అయితే, ఇప్పుడు అదే ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు రాయాల్సిన కోడింగ్‌ను ఏఐ రాసి పెడుతున్నది. దీంతో టెక్ సంస్థలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచుతున్నాయి. తమ ప్రొడక్షన్ కాస్ట్‌ను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. బెంచ్పై ఉన్న ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నాయి.
ఐటీ కంపెనీల్లో ఏఐ కారణంగానే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, రానున్న రోజుల్లో దీని వాడకం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఐటీ కొలువులే కాకుండా బ్యాంకు ఉద్యోగాలనూ దెబ్బకొట్టనున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. నేషనల్, ఇంటర్నేషనల్ బ్యాంకులు ఏఐ వినియోగాన్ని పెంచుతున్నాయి.
ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని, స్కిల్స్ పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ, రోబోటిక్స్, మెషీన్ లర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులు నేర్చుకున్నోళ్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే చాన్స్ ఉందని చెబుతున్నారు. జావా, డాట్‌నెట్, సీ, సీ++.. ఇలా ఎన్ని ప్రోగ్రామింగ్ ల్యాంగేజీల్లో అనుభవం ఉన్నా ఏఐలో నైపుణ్యం లేకుంటే ఉద్యోగావకాశం ఉండదని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నైపుణ్యం కూడా ఉండాలని అంటున్నారు.
