టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాజిక్ చేస్తోంది. మొదట బ్యాటింగ్ లో 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన షెఫాలీ ఆ తర్వాత బౌలింగ్ లోనూ రాణించి కీలక సమయంలో రెండు వికెట్లు పడగొట్టింది. ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తన స్పిన్ తో మాయాజాలం చేసి మ్యాచ్ ను భారత జట్టు వైపుకు తిప్పింది. 20 ఓవర్లో సునే లూస్ ఔట్ (25) చేసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని విడగొట్టిన షెఫాలీ..ఆ తర్వాత తాను వేసిన ఓవర్లో మారిజాన్ కాప్ ను 4 పరుగుల వద్ద పెవిలియన్ కు పంపింది.
2 వికెట్ల నష్టానికి 114 పరుగులతో పటిష్టంగా ఉన్న సౌతాఫ్రికా షెఫాలీ ధాటికి రెండు కీలక వికెట్లు చేజార్చుకొని 4 వికెట్ల నష్టానికి 123 పరుగులతో నిలిచింది. 299 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ప్రస్తుతం 26 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. సౌతాఫ్రికా విజయానికి 24 ఓవర్లలో 165 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. హాఫ్ సెంచరీ చేసి ఫామ్ లో ఉన్న లారా వోల్వార్డ్ (69) పైనే సౌతాఫ్రికా ఆశలు పెట్టుకుంది. క్రీజ్ లో వోల్వార్డ్ తో పాటు సినాలో జాఫ్తా (8) ఉంది. ఇండియా బౌలర్లలో షెఫాలీ రెండు.. శ్రీ చరనికి ఒక వికెట్ దక్కింది
►ALSO READ | Smriti Mandhana: వరల్డ్ కప్‌లో స్మృతినే టాప్.. మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన టీమిండియా ఓపెనర్
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసి సౌతాఫ్రికాకు ఛాలెంజ్ విసిరింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (87)తో పాటు మిడిల్ ఆర్డర్ లో దీప్తి శర్మ(58) హాఫ్ సెంచరీలు చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షెఫాలీ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాకా మూడు వికెట్లు పడగొట్టింది. ట్రయిన్, నాడిన్ డి క్లెర్క్, నాన్కులులేకో తలో వికెట్ తీసుకున్నారు.
