గడ్డం పెంచుకొని.. టోపీ పెట్టుకున్నందుకు నేను తీవ్ర వాదినా..?

గడ్డం పెంచుకొని.. టోపీ పెట్టుకున్నందుకు నేను తీవ్ర వాదినా..?
  • నేను నా మతాన్ని గర్వంగా ఆచరిస్తానన్న ఒవైసీ 
  • తేజస్వీయాదవ్ పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ 
  •  బీహార్ లో పెరిగిన పొలిటికల్ హీట్ 

పాట్నా: గడ్డం పెంచుకొని, టోపీ పెట్టుకున్నంత మాత్రాన తనను తీవ్ర వాది అని విమర్శించడం సరికాదని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో అసదుద్దీన్ మాట్లాడారు. తేజస్వీ యాదవ్ తనను తీవ్రవాది అని పిలిచారని తీవ్రంగా విమర్శించారు. కిషన్‌గంజ్‌లో జరిగిన సభలో ఓవైసీ మాట్లాడుతూ, “ఒక ఇంటర్వ్యూలో తేజస్వీ యాదవ్, ఓవైసీతో కూటమి ఎందుకు చేయలేదని అడిగితే, ఆయన ‘ఓవైసీ తీవ్రవాది’ అని అన్నాడు. 

నేను నా మతాన్ని గర్వంగా ఆచరిస్తే అతివాదినవుతానా? గడ్డం పెట్టుకున్నానని, టోపీ పెట్టుకున్నానని నన్ను అతివాది అంటావా?” అని ప్రశ్నించారు. “తేజస్వీ యాదవ్ పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నాడు. ‘ఎక్స్ట్రీమిస్ట్’ అనే పదం పాకిస్తాన్ నుంచే తీసుకున్నాడు” అని ఓవైసీ విమర్శించారు. “బాబు, ‘ఎక్స్ట్రీమిస్ట్’ అనే పదాన్ని ఆంగ్లంలో రాయగలవా?” అంటూ వ్యంగ్యంగా అన్నారు. ఓవైసీ ఆరంభంలో మహాగఠబంధన్ (రాజద్, కాంగ్రెస్ కూటమి)తో కలిసేందుకు ఆసక్తి చూపించారు. కానీ RJD నుంచి స్పందన రాకపోవడంతో AIMIM స్వతంత్రంగా 100 సీట్లలో పోటీ చేయాలని ప్రకటించింది. 2020లో ఎంఐఎం 20 సీట్లలో పోటీ చేసి, సీమాంచల్ ప్రాంతంలో 5 సీట్లు గెలుచుకుంది. ఆ ఐదుగురిలో నలుగురు తర్వాత రాజద్‌లో చేరారు. ఈ ప్రాంతంలో ముస్లింల శాతం ఎక్కువగా ఉండటం వల్ల, ఓవైసీ అక్కడ ముస్లిం ఓటర్లపై ఆయన దృష్టి పెడుతున్నారు.