చేవెళ్ల బస్సు ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ వివరాలు తెలిశాయి. సోమవారం (నవంబర్ 03) చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది మృతికి కారకుడైన ట్రక్కు డ్రైవర్ ను మహారాష్ట్ర వాసిగా గుర్తించారు పోలీసులు. ఓనర్, డ్రైవర్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
టిప్పర్ డ్రైవర్ ను మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన ఆకాష్ కాంబ్లేగా పోలీసులు గుర్తించారు. ఆకాశ్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లచ్చానాయక్ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం పటాన్‌చెరు క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర తీసుకెళ్తూ ఈ ఘోర ప్రమాదానికి కారకుడయ్యాడు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కోసం అతని శాంపిల్స్ ల్యాబ్ కి పంపించారు పోలీసులు. ప్రమాద ఘటనపై కండక్టర్ రాధా ఇచ్చిన ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్ ఆకాష్ పై 106(1) BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు చేవెళ్ల పోలీసులు.
సోమవారం ఉదయం చెవెళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్, డ్రవర్ వెనక కూర్చున్న వాళ్లు చాలా మంది చనిపోయారు. మొత్తం 19 మంది చనిపోయినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
నిర్మాణ పనుల కోసం పటాన్ చెరు నుంచి వికారాబాద్ కు కంకర లోడ్ తో టిప్పర్ వెళ్తున్న క్రమంలో రాంగ్ రూట్ లో వెళ్లి బస్సును ఢీకొట్టింది టిప్పర్. తాండూర్ నుండి హైదరాబాద్ బయలుదేరిన ఈ బస్సులో ప్రమాద సమయంలో 72 మంది ప్రయాణికులు ఉన్నారు.
