కుక్కను చూసుకునేందుకు రూ.23 వేల జీతం ఇస్తే.. నెల రోజులకే చంపేసింది.. బెంగళూరులో మహిళ అరెస్టు

కుక్కను చూసుకునేందుకు రూ.23 వేల జీతం ఇస్తే.. నెల రోజులకే చంపేసింది.. బెంగళూరులో మహిళ అరెస్టు

కొందరు పెంపుడు జంతువులను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. అలాంటి ఒక యజమాని తన పెంపుడు కుక్కను చూసుకునేందుకు ఒక పనిమనిషిని నియమించుకుంది. ఆమెకు ఉండటానికి ఇల్లు, 23 వేల రూపాయల జీతం ఇచ్చి కుక్క బాధ్యతలు అప్పగించింది. కానీ ఆ పనిమనిషి నెల రోజులు గడవక ముందే ఆ పెట్ డాగ్ ను చంపేసింది. ఈ అమానవీయ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బెంగళూర్ కు చెందిన రషిక కే.ఆర్. అనే ఒక ఎంబీఏ స్టూడెంట్.. తన రెండు పెంపుడు కుక్కల బాధ్యత చూసుకునేందుకు తమిళనాడుకు చెందిన పుష్పలత అనే మహిళను నియమించుకుంది. అందుకోసం ఆమెకు నెలకు 23 వేల రూపాయల జీతం ఇస్తూ.. ఉండటానికి అదే అపార్టుమెంటులో ఇంటి సదుపాయం కల్పించింది. కానీ నెల రోజుల్లోనే కుక్క ప్రాణాలు తీయటం ఆ ఓనర్ ను తీవ్ర విషాదంలో ముంచేసింది. 

శనివారం (నవంబర్ 01) రెండు పెట్స్ ను వాకింగ్ కు తీసుకెళ్లింది పుష్పలత. తిరిగి వస్తున్న క్రమంలో ఒక కుక్క గూసీ ని లిఫ్టులో చంపేసింది. లిఫ్టు గోడకు బాది గూసీని చంపేసింది. ఆ తర్వాత ఓనర్ దగ్గరికి వెళ్లి ప్రమాద వశాత్తు చనిపోయిందని ఏడవటం మొదలెట్టింది. 

పుష్పలత పై అనుమానంతో సీసీటీవీ ఫుటేజ్ చూడగా.. దారుణంగా గోడకు బాది చంపడం చూసి షాకైంది ఓనర్. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు.

చిరాకుతోనే చంపేశా..

ఈ కేసుకు సంబంధించి మహిళను స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు పోలీసులు. కుక్కలతో విసుగు చెందటంతోనే చంపేసినట్లు పోలీసులకు చెప్పింది. పగలు రాత్రి తేడా లేకుండా మొరుగుతూ విసుగు పుట్టిస్తున్నాయని.. నిద్ర కూడా ఉండటం లేదని.. అందుకే చంపినట్లు పోలీసులకు తెలిపింది. 

అయితే అంతకు ముందు పుష్పలత ఓనర్ ఇంట్లో రెండు మూడు సార్లు దొంగతనాలకు పాల్పడిందట. దీంతో ఓనర్ రషిక వార్నింగ్ ఇచ్చిందట. అది మనసులో పెట్టుకుని కుక్కపిల్లను చంపేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.