రాంగ్ రూట్.. ఓవర్ స్పీడ్..!.. చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణాలివే

రాంగ్ రూట్.. ఓవర్ స్పీడ్..!.. చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణాలివే

 హైదరాబాద్: రాంగ్ రూట్ లో ఓవర్ స్పీడ్ తో వస్తున్న టిప్పర్లు ప్రాణాలు బలిగొంటున్నాయి. ఇవాళ చేవెళ్ల సమీపంలోని మీర్జాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో సైతం టిప్పర్ రాంగ్ రూట్ లో వచ్చి.. బస్సు డ్రైవర్ కూర్చున్న భాగాన్ని ఢీకొట్టి ముందుకు వెళ్లి బస్సుపై పడిపోయింది. దీంతో డ్రైవర్ వెనుక వరుసలో కూర్చున్న సీట్ల వాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులు బస్సేక్కే మెట్ల వైపు ఉన్న వాళ్లంతా స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డారు. గత నెల 15న కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి సమీపంలో రాంగ్ రూట్ లో వచ్చిన ఓ టిప్పర్ ఎలక్ట్రిక్ స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో తాత, తల్లి, ఇద్దరు కుమారులు.

 రాంగ్ రూట్ లో వాహనాలు నడపడం ప్రమాదకరమైనప్పటికి యూటర్న్ దూరంలో ఉండటంతో చాలా మంది షార్ట్ కట్ కోసం రాంగ్ రూట్ లో వస్తూ ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు. ఓవర్ స్పీడ్ తో రోజుకు 15 మంది మృతి కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని హైవేలపై ప్రతిరోజూ సగటున 15 మంది ‘అతివేగం’ కారణంగా మరణిస్తున్నారు. 2023లో రెండు రాష్ట్రాలలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 5,500 మంది అతివేగం సంబంధిత ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాద మరణాలలో 30% మరణాలు అతివేగం కారణంగానే జరుగుతున్నాయి. అతివేగం వల్ల సంభవించే మరణాల విషయానికి వస్తే, దేశంలోనే తెలంగాణ ఏడవ స్థానంలో ఉంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా తదితర పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరుసలో ఉంది. రోడ్డు ప్రమాదాలలో 80 శాతానికి మించిన ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు.