తుప్పు పడుతున్న వ్యవసాయ పరికరాలు

తుప్పు పడుతున్న వ్యవసాయ పరికరాలు
  • పాడైపోతున్న అగ్రికల్చర్ మిషన్లు
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
  • లక్షలు పెట్టి వృథాగాఉంచడంపై రైతుల మండిపాటు

మెదక్, పాపన్నపేట, వెలుగు: వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న సర్కారు.. అమలులో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.  లక్షలు పెట్టి వివిధ రకాల యంత్రాలు కొంటున్నా వ్యవసాయ అధికారులు వాటిని వృథాగా ఉంచుతున్నారు. దీంతో అవి తుప్పు పట్టి పాడై పోతున్నాయి. రూర్బన్  స్కీమ్ కింద పాపన్నపేట మండలం ఎంపిక కాగా  రూ.30 కోట్లు మంజూరయ్యాయి. ఈ ఫండ్స్‌‌‌‌ను మండలంలోని వివిధ గ్రామాల్లో డెవలప్ మెంట్ వర్క్స్ కోసం కేటాయించారు. ఇందులో భాగంగా పంటల సాగు అవసరాలకు పనికి వచ్చే వివిధ వ్యవసాయ యంత్రాలను రూ.50 లక్షలతో కొనుగోలు చేశారు. 

ఏమేం కొన్నరంటే...

అగ్రికల్చర్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు కేటాయించిన ఫండ్స్ తో 2020లో  వరి నాటే మిషన్లు 3, పొలంలో విత్తనాలు, ఎరువులు వేసే మిషన్లు  4, మక్కల నూర్పిడి మిషన్లు 2, గడ్డి కట్టే మిషన్లు  5, గడ్డి కోసే మిషన్లు 8, తైవాన్ స్ప్రేయర్లు 10,  ఒక ట్రాక్టర్ కొనుగోలు చేశారు.  కానీ, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ అధికారులు మిషన్లు కొనడంలో చూపిన శ్రద్ధ వాటిని వినియోగంలోకి తేవడంపై చూపలేదు. వీటిని అవసరమైన రైతులకు ఇవ్వడం, మెయింటెనెన్స్ కోసం  రైతు బంధు సమన్వయ సమితితో కలిసి 11 మందితో ఒక కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ ఆధ్వర్యంలో కస్టమర్ సెంటర్ ఏర్పాటు చేసి మిషన్లను అవసరం ఉన్న రైతులకు కిరాయికి ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని  మిషన్ల  మెయింటెనెన్స్‌‌‌‌తో పాటు ఆపరేట్లు, డ్రైవర్ల జీతాలకు ఉపయోగించాల్సి ఉంటుంది.  

రెండేళ్లయినా.. 

కమిటీ ఏర్పాటు చేసి రెండేళ్లైనా కస్టమర్ సెంటర్ ఏర్పాటు చేయలేదు.  మొదట్లో మిషన్లను పాపన్నపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌‌‌‌ ఆవరణలో ఉంచి..ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు  కొన్ని మిషన్లను రైతులకు కిరాయికి ఇచ్చారు.  మిగితా మిషన్లు అక్కడే వృథాగా ఉంటున్నాయి. దాదాపు రెండేళ్లుగా వినియోగించకుండా ఉంచడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పుపట్టి పోతున్నాయి.  అంతేకాదు కొన్ని మిషన్లు ఎక్కడ ఉన్నాయో ఆఫీసర్లకు కుడా తెలియక పోవడం గమనార్హం.

ఉట్టిగా ఉంచితే ఏంలాభం
రైతుల కోసమని మిషన్లు కొనడం మంచిగానే ఉంది. కానీ,  వాటిని ఎవరికి కిరాయికి ఇయ్యకుండా ఉట్టిగానే ఉంచుతున్రు. కొని ఏం లాభం మరి. మిషన్లు ఉన్నా ఇయ్యక పోవడంతోని బయట ఎక్కువ పైసలు పెట్టి కిరాయికి తీసుకుంటున్నం. 
- కిష్టాగౌడ్, రైతు, పాపన్నపేట 

ఎక్కడున్నాయో తెలియదు
రూర్బన్ ఫండ్స్‌‌‌‌తో  అగ్రికల్చర్ మిషన్లు కొన్నట్టు తెలుసు. కానీ, ప్రస్తుతం అవి ఎక్కడున్నాయో తెలియదు. ఈ మధ్య ఎంక్వైరీ చేశాను.ఈ పనిముట్ల విషయంలో రాజకీయం ఎక్కువగా ఉంది. కొంత మంది లీడర్ల సంబంధీకుల వద్ద మిషన్లు ఉన్నట్లు గుర్తించాం.  రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు విదేశాలకు వెళ్లాడు. ఆయన రాగానే కమిటీ మెంబర్లతో మీటింగ్ పెట్టి మిషన్లను స్వాధీనం చేసుకుంది. తర్వాత ఐకేపీకి అప్పజెప్తం.
- నాగం కృష్ణ, అగ్రికల్చర్ ఆఫీసర్ , పాపన్నపేట