
మెదక్‌లో జోరుగా వరినాట్లేస్తున్న యూపీ, బిహార్ కూలీలు
మెదక్/కౌడిపల్లి/నిజాంపేట, వెలుగు : ఈసారి మెదక్ జిల్లాలో 3.10 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతుందని అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్అంచనా వేసింది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వరినాట్లు ఊపందుకున్నాయి. దీంతో కూలీల కొరత ఏర్పడింది. రైతులకు ఆర్థిక భారంగా మారింది. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో త్వరగా నాట్లు వేస్తున్న యూపీ, బిహార్ కూలీల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు.
130 టీమ్స్వచినయ్..
జిల్లాలో వరి నాట్లకు మంచి డిమాండ్ ఉండటంతో ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి దాదాపు 130 టీమ్ లు వచ్చాయి. ఒక్కో టీమ్ లో 15 నుంచి 20 మంది కూలీల చొప్పున ఉన్నారు. దాదాపు అందరూ యువకులే కావడం గమనార్హం. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన వారు టీమ్‌లుగా విడిపోయి వరి సాగు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు చేరుకుని జోరుగా నాట్లేస్తున్నారు. ఇక్కడి మహిళా కూలీల ద్వారా ఎకరా నాటేసేందుకు రూ.6 వేల వరకు ఖర్చవుతోంది.ఆలస్యం అవుతోంది. అదే యూపీ, బిహార్ కూలీలు మాత్రం ఎకరాకు రూ.4,500 చొప్పున తీసుకుంటున్నారు. స్పీడ్‌గా నాటేస్తున్నారు. ఉదయం 6 గంటలకే పొలంలో దిగి సాయంత్రం వరకు ఐదారు ఎకరాల వరకు నాటు పూర్తి చేస్తున్నారు. ఖర్చు తక్కువ అవుతుండటం, త్వరగా పని పూర్తవుతుండటంతో ఎక్కువ మంది రైతులు ఇతర రాష్ట్రాల కూలీలతోనే నాటు వేయిస్తున్నారు.
ఉపాధి కోసం ఇక్కడికొస్తున్నాం..
మా రాష్ట్రంలో సరైన పనుల్లేవు. అందుకే ఇక్కడికి ఉపాధి కోసం వస్తున్నాం. ప్రతి ఏడాది పంటల సీజన్లో రెండు నెలల పాటు ఇలా వరి నాట్లు వేసి సంపాదిస్తాం. ఆ తర్వాత సొంత ఊర్లకు వెళ్లి కుటుంబాలను పోషించుకుంటాం. అక్కడ రోడ్డుపై చెరుకు రసం బండ్లు నడుపుతూ, అడ్డాకూలీలుగా పనిచేస్తాం. - శివ కుమార్, కూలీ, యూపీ
టీమ్ వర్క్‌తో లాభం
ఇక్కడ రెండు సీజన్లలో మాకు వరి నాటు వేసే పనిదొరుకుతుంది. టీమ్ వర్క్‌తో లాభం ఉంటుంది. ఒక టీం ఒక రోజులో ఏడు ఎకరాలు నాటేస్తుంది. ఎకరాకు 4 వేల రూపాయల చొప్పున అందరం కలిసి రూ.28 వేలు సంపాదిస్తాం. రోజుకు ఒక్కొక్కరికి రూ.1,400 చొప్పున రెండు నెలల్లో రూ.84 వేల వరకు సంపాదిస్తాం. -పంకజ్ కుమార్ , కూలీ, యూపీ