35 మంది ఏఈఓలపై చర్యలు..అగ్రికల్చర్ డైరెక్టర్ వెల్లడి

35 మంది ఏఈఓలపై చర్యలు..అగ్రికల్చర్ డైరెక్టర్  వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్  జయశంకర్  వ్యవసాయ వర్సిటీ పరిధిలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో 35 మంది ఏఈఓలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని అగ్రికల్చర్​ డైరెక్టర్  డాక్టర్​ బి.గోపి వెల్లడించారు. ఇన్‌‌ సర్వీస్‌‌ కోటాలో అగ్రికల్చర్​ బీఎస్సీ చదువుతూ తాజాగా పేపర్​ లీకులకు పాల్పడిన వ్యవహారంలో 35మంది ఇన్​సర్వీస్​ ఏఈఓలు సస్పెండ్​ అయిన విషయం తెలిసిందే.  

ఇటీవల అగ్రికల్చర్​ వర్సిటీలో మూడో సంవత్సరం బీఎస్సీ చదువుతున్న 35 మంది అభ్యర్థులు.. వర్సిటీ సిబ్బంది సహకారంతో ప్రశ్నపత్రాలను ముందుగానే లీక్‌‌  చేసి వాట్సాప్‌‌  గ్రూపుల ద్వారా ఇతర అగ్రికల్చర్​ కాలేజీల విద్యార్థులకు పంపినట్టు తేలింది. ఈ వ్యవహారంలో భారీగా డబ్బు చేతులు మారినట్టు, ఒక పథకం ప్రకారం కొన్నేండ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్టు స్పష్టమైంది. 

ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన అగ్రికల్చర్  వర్సిటీ.. ఒక ఉన్నతాధికారితో పాటు నలుగురు సిబ్బందిని సస్పెండ్‌‌  చేసింది. అదే సమయంలో ఇన్‌‌ సర్వీస్‌‌ కోటాలో వచ్చిన దాదాపు 35 మంది అభ్యర్థులను డిస్మిస్‌‌ చేసి, వారిని తిరిగి వ్యవసాయ శాఖకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వరంగల్​ యూనివర్సిటీలో తనిఖీలు

వరంగల్ ​సిటీ, వెలుగు: వరంగల్​లోని జయశంకర్​ అగ్రికల్చర్  యూనివర్సిటీలో పేపర్  లీకేజీపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ఈ విచారణ కమిటీ శుక్రవారం వరంగల్​ లోని యూనివర్సిటీకి చేరుకొని అధికారులను విచారించింది. రికార్డులను తనిఖీలు చేసింది. తనిఖీలలో భాగంగా కొన్ని హార్డ్​డిస్కులు, రికార్డులను తీసుకెళ్లింది. ఆరు నెలల క్రితం అగ్రికల్చర్  ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్​ (ఏఈఓ) లకు సంబంధించిన ప్రమోషన్ల కోసం ప్రభుత్వం  పరీక్ష నిర్వహించింది. 

ఇందులో కొందరు ఏఈఓలు వరంగల్​ యూనివర్సిటీలోని జూనియర్  అసిస్టెంట్​ సహాయంతో ప్రశ్నాపత్రం లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లీకేజీ వ్యవహారాన్ని జగిత్యాలలో గుర్తించి ఇప్పటికే 35 మంది ఉద్యోగులను గుర్తించి సస్పెండ్​ చేశారు.