రైతుల సేవలో 250 మంది అగ్రి స్టూడెంట్స్!

రైతుల సేవలో  250 మంది అగ్రి స్టూడెంట్స్!

మెదక్(శివ్వంపేట), వెలుగు: అగ్రికల్చర్ కోర్సులు చదువుతున్న స్టూడెంట్ ఫీల్డ్ ఎక్సిపీరియన్స్ లో భాగంగా గ్రామాలకు వచ్చి పంట సాగు పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు రైతులకు ఉచిత సేవలందిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్, పంజాబ్ రాష్ట్రం లూథియానాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ,  ఇబ్రహీంపట్నంలోని గ్రీన్ ఫీల్డ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, హైదరాబాద్ లోని అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ కాలేజీకి చెందిన 250 మంది స్టూడెంట్స్​ అగ్రికల్చర్ బీఎస్సీ, డిప్లమో చదువుతున్నారు.  

వీరు కౌడిపల్లి మండలం తునికిలోని రామానాయుడు కృషి విజ్ఞాన కేంద్రం అగ్రికల్చర్ సైంటిస్ట్ ల పర్యవేక్షణలో రెండు నెలలుగా ఆయా గ్రామాల్లోనే ఉంటూ రోజూ పొలాల వద్దకు వెళ్లి రైతులు పంటలు ఎలా సాగు చేస్తున్నారో పరిశీలిస్తున్నారు. నాట్లు వేయడం, ఎరువులు చల్లడం, కలుపు తీయడం, పంట కోత తదితర పనుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. యూనివర్సిటీ, కాలేజీలో నేర్చుకున్న అంశాలను ఫీల్డ్ లో ప్రాక్టికల్ గా అవలంభిస్తున్నారు. పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, భూసార పరీక్షలు ఆవశ్యకత, విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం, సస్యరక్షణ తదితర అంశాలపై అవగాహన కలిగిస్తున్నారు. ఆయా విషయాల్లో రైతులకు వచ్చి డౌట్లను క్లియర్​ చేస్తున్నారు. రైతులు సేంద్రియ, ప్రకృతి సేద్యం చేసేలా చైతన్య పరుస్తున్నారు. జీవామృతం, వర్మి కంపోస్ట్ తయారీపై శిక్షణ ఇస్తున్నారు. ఆరోగ్య ప్రదమైన పంట ఉత్పత్తులతో కలిగే బెనిఫిట్స్ వివరిస్తున్నారు.  మహిళలకు ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కలిగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తమ సొంత డబ్బులతో శానిటరీ నాప్​కిన్స్ పంపిణీ చేస్తున్నారు.