తెలంగాణలో ఈ ఏడాది యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి సాగయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ యేడు భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు, బావులు, భూగర్భ జలాలు నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో యాసంగి వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు.
యాసంగిలో పెరగనున్న మక్కల సాగు జోరు..
ఈయేడు యాసంగిలో ఇప్పటి నుంచే మక్కల సాగు జోరందుకుంటోంది. యాసంగిలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 6.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 88 వేల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో ప్రధానంగా యాసంగిలో వరితో పాటు మొక్కజొన్న ఎక్కువగా సాగు జరుగుతుంది. అలాగే, అన్ని రకాల పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 4.01 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 65 వేల ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో ప్రధానంగా పప్పుశనగ 3.04 లక్షల ఎకరాల సాధారణ సాగు కాగా, ఇప్పటి వరకు 55 వేల ఎకరాల్లో సాగు జరిగింది. పప్పు శనగ ఈ యేడు భారీగానే పెరిగే అవకాశం ఉంది. మినుముల సాధారణ సాగు విస్తీర్ణం 54,968 ఎకరాలు కాగా, ఈయేడు ఇప్పటికే మినుములు 6,667 ఎకరాల్లో సాగు చేశారు. పొద్దుతిరుగుడు సాధారణ సాగు 24,786 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 155 ఎకరాల్లో, కుసుమలు 1,610 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. పొగాకు 4,483 ఎకరాల్లో, ఇతర పంటలు 7,249 ఎకరాల్లో వేశారు. ఈ యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం 2.68 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి
