నిజాం షుగర్స్​​ ఫ్యాక్టరీని ఇంకెప్పుడు తెరుస్తరు?

నిజాం షుగర్స్​​ ఫ్యాక్టరీని ఇంకెప్పుడు తెరుస్తరు?
  • 100 రోజులన్నరు.. 8 ఏండ్లయినా చర్యల్లేవంటూ ఫైర్
  • ఫ్యాక్టరీని ఓపెన్​ చేయకపోతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిక

నిజామాబాద్,  వెలుగు :    వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి చెరుకు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ఇంకెప్పుడు రీఓపెన్ చేస్తారంటూ రైతులు ఆయనను నిలదీశారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లిలో శుక్రవారం వానాకాలం పంటల సాగు, యాజమాన్య పద్ధతులపై రైతు అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడుతుండగా రైతులు నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ‘‘టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. 100 రోజుల్లోనే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తామన్నరు. కానీ 8 ఏండ్లు అవుతున్నా.. ఫ్యాక్టరీ రీఓపెన్ కు ఎలాంటి చర్యలు తీస్కోలేదు. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. నిజాం షుగర్స్ ఓపెన్ చేయకపోతే తగిన బుద్ధి చెప్తాం” అని రైతులు హెచ్చరించారు. త్వరలోనే నిజాం షుగర్స్ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. 

దమ్ముంటే దర్యాప్తు చేయించండి.. 
నిజామాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత క్యాంపు ఆఫీసులోనూ  మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటున్న బీజేపీ నేతలు.. దమ్ముంటే దర్యాప్తు చేయించాలని సవాల్ విసిరారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం పథకాలను కేంద్రం పార్లమెంటులోనే మెచ్చుకున్నదని, ఆ విషయం మర్చిపోయి బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వీధిరౌడీలా మాట్లాడారని మంత్రి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పార్లమెంటులో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు.. ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రమంత్రి సమాధానం చెప్పారన్నారు.  ‘‘తెలంగాణ రాజకీయ ప్రయోగశాల కాదు. నిన్న నడ్డా.. నేడు రాహుల్ గాంధీ తెలంగాణలో అడ్డా వేశారు. అయినా వారికి ఒరిగేదేమీ ఉండదు” అని మంత్రి చెప్పారు.