ఆగని వాన.. ఆగమైతున్న రైతన్న

ఆగని వాన.. ఆగమైతున్న రైతన్న
  • ఆగని వాన.. ఆగమైతున్న రైతన్న
  • ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులుగా పడుతున్న వాన,వడగండ్లు
  • వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు 
  • కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోతున్న వడ్లు
  • జనగమ జిల్లాలో రూ.100 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా

జనగామ, వెలుగు : జనగామ జిల్లాలో ఇప్పటివరకు 46, 972 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సర్వే ఇంకా కొనసాగుతుండడంతో నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. దెబ్బతిన్న పంటల విలువ రూ. 100 కోట్లకుపైగానే ఉంటుందని తెలుస్తోంది. జిల్లాలోని జనగామ, బచ్చన్నపేట, లింగాల ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, చిల్పూరు, స్టేషన్‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, రఘునాథపల్లి, పాలకుర్తి, కొడకండ్ల, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో ఎక్కువ నష్టం జరిగింది. మొత్తం 107 గ్రామాల్లో 19,442 మంది రైతులు నష్టపోయారు. 43,480 ఎకరాల్లో వరి, 233 ఎకరాల్లో మక్కజొన్న, 3,166 ఎకరాల్లో మామిడి, 93 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.  

కల్లాల్లోనే మొలకెత్తిన వడ్లు.. నీటిలో మునిగిన మక్కజొన్న 

ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి. పంట చేతికొచ్చే దశలో ఈదురుగాలులకు తోడు వాన, వడగండ్లు పడడంతో వేలాది ఎకరాల్లో వరి, మక్కజొన్న పంటలు, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో రాశులుగా పోసిన వడ్లు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో రైతులపై కోలుకోలేని భారం పడింది. మరో రెండు మూడు రోజులు వానలు పడే అవకాశం ఉండంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 
భీమదేవరపల్లి/కమలాపూర్‌‌‌‌‌‌‌‌/మహాముత్తారం/పర్వతగిరి/నెక్కొండ/రాయపర్తి, వెలుగు : అకాల వర్షం కారణంగా కల్లాల్లో పోసిన వడ్లు, మక్కజొన్న పూర్తిగా తడిసిపోయాయి. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి, కమలాపూర్‌‌‌‌‌‌‌‌, భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తి మండలాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం పడింది. కల్లాల్లో ఆరబోసిన వడ్లు, మక్కజొన్న పూర్తిగా తడిసిపోయింది. దీంతో కనీసం పెట్టుబడైనా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌లో 11 వేల ఎకరాల్లో...

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో పాటు వర్షం పడడంతో మక్కజొన్న, వరి, మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. మక్క, వరి పంటలు నేలకొరగగా, మామిడి కాయలు రాలిపోయాయి. జిల్లాలో 7,408 ఎకరాల్లో వరి, 607 ఎకరాల్లో మక్కజొన్న, 3,047 ఎకరాల్లో మామిడి కలిపి మొత్తం 9,400 మంది రైతులకు చెందిన 11,062 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. నెల్లికుదురు, డోర్నకల్, కురవి, సీరోలు, మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, ఇనుగుర్తి, తొర్రూరు, పెద్దవంగర, నరసింహులపేట మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడువగా, కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో మక్కలు తడిసిపోయాయి.