ఆన్‌లైన్‌లో రైతులు, భూముల లెక్కలు.. డేటా సేకరిస్తున్న సర్కారు

ఆన్‌లైన్‌లో రైతులు, భూముల లెక్కలు.. డేటా సేకరిస్తున్న సర్కారు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో వ్యవసాయశాఖ 11వ అగ్రికల్చర్‌‌  సెన్సస్‌‌  ఆన్‌‌లైన్‌‌ విధానానికి శ్రీకారం చుట్టింది. సోమవారం ఆన్ లైన్ లో డేటా సేకరణ షురూ చేసింది. గతంలో ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో వీఆర్ఏలు ఐదేళ్లకు ఒకసారి అగ్రి సెన్సస్‌‌  చేపట్టేవారు. 2021–22లో జరగాల్సిన సెన్సస్‌‌  నిలిచిపోయింది. వీఆర్‌‌ఓ వ్యవస్థను పూర్తిగా రద్దుచేయడం, ప్లానింగ్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో స్టాఫ్‌‌  లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ బాధ్యతను ప్రభుత్వం వ్యవసాయ శాఖకు అప్పగించింది.

క్షేత్రస్థాయి అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి రెవెన్యూ రికార్డుల ఆధారంగా సర్వే నంబరులో రైతులకు సంబంధించిన వ్యవసాయ భూమి వివరాలను నమోదు చేస్తున్నారు. దీని ఆధారంగా రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ భూముల లెక్కలు తీయనున్నారు. రాష్ట్రంలో  అగ్రికల్చర్‌‌  ఎక్స్‌‌టెన్షన్‌‌  ఆఫీసర్లు (ఏఈఓ) రైతుల డేటాను సేకరిస్తున్నారు. అగ్రికల్చర్‌‌  సెన్సస్‌‌పై  ఏఈఓలకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇప్పించింది.

భూమి కలిగిన వారి వివరాలతో పాటు సీసీఈ యాప్‌‌ పై ఏడీఏ, ఎంఎవోలు, ఏఈఓలకు ట్రెయినింగ్‌‌ ఇచ్చారు.  రైతులు ఏ సర్వే నంబర్‌‌లో  ఏ  పంటలు సాగు చేస్తున్నారు,  రైతు స్వయంగా సాగు చేస్తున్నాడా లేక కుటుంబ సభ్యుల నిర్వహణలో ఉందా, లేదా కౌలుకు ఇచ్చారా అన్న వివరాలు సేకరిస్తున్నారు. రైతుల భూమి అదే గ్రామంలో ఉందా లేదా ఇతర గ్రామాల్లో ఉందా అనే వివరాలతో సేకరించిన డేటాను ప్రత్యేకంగా ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేస్తున్నారు. 

ప్రత్యేక యాప్‌‌లో డేటా అప్‌‌లోడ్‌‌

రైతుల పేర్లు, భూమి, సాగు వివరాలను ఏఈఓలు సేకరిస్తున్నారు.ఈ డేటాను సీసీఈ యాప్‌‌లో అప్ లోడ్  చేస్తున్నారు. గ్రామాలకు వెళ్లి  సర్వే నంబర్‌‌ పొలాల్లో పంటల వివరాలను అప్‌‌లోడ్‌‌  చేస్తున్నారు. పంటకు ఎలాంటి నీటి సౌకర్యాలు ఉన్నాయి, వర్షాధార పంటనా, బోరుబావి సౌకర్యం, చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల నుంచి సాగునీటి సౌకర్యం ఉందా అన్న వివరాలను యాప్‌‌లో నమోదు చేస్తున్నారు.