కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయ విద్యుత్

కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయ విద్యుత్
  • కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయ విద్యుత్
  • లిఫ్ట్ ఇరిగేషన్, మంచినీటి సరఫరా కరెంట్ కూడా..  
  • సీఎం రేవంత్‌‌కు అధికారుల ప్రతిపాదనలు
  • కేబినెట్ ఆమోదం తర్వాత ముందుకెళ్లాలని సీఎం ఆదేశం
  • ప్రస్తుతమున్న రెండు డిస్కంలను మూడుగా విభజించండి
  • పీపీఏ అలొకేషన్, ఆస్తులు, బకాయిలు, సిబ్బందిని పంచండి
  • డిసెంబర్‌‌‌‌లోగా అండర్‌‌‌‌ గ్రౌండ్ కేబులింగ్‌‌కు సమగ్ర ప్రణాళిక 
  • రెండున్నరేండ్లలో కోర్ అర్బన్ రీజియన్‌‌లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం పరిధిలోకి వ్యవసాయం, మేజర్, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని తీసుకురానున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్​రెడ్డికి ఇంధన శాఖ అధికారులు ప్రపోజల్స్​ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌లోని నివాసంలో జరిగిన సమావేశంలో కొత్త డిస్కం ఏర్పాటు, అండర్ ​గ్రౌండ్​ విద్యుత్ కేబులింగ్ విధానంపై సీఎంకు అధికారులు పలు ప్రతిపాదనలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర కేబినెట్ ఆమోదం అనంతరం కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.  అంతలోగా పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతమున్న రెండు డిస్కంలను మూడుగా పునర్విభజన చేయాలన్నారు.  కొత్త డిస్కంకు సంబంధించి పీపీఏ అలొకేషన్, సిబ్బం ది, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై పలు కీలక సూచనలు చేశారు. 

అండర్ గ్రౌండ్ కేబులింగ్‌పై అధ్యయనం.. 

గ్రేటర్ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై సీఎంకు అధికారులు పలు ప్రతిపాదనలు అందజేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిసెంబర్‌‌లోగా పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే రెండున్నరేండ్లలో కోర్ అర్బన్ రీజియన్‌లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ పూర్తి చేయాలన్నారు. ‘‘కోర్ అర్బన్ రీజియన్‌లో ముందుగా విద్యుత్ సబ్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలి. పవర్ లోడ్ సమస్య తలెత్తకుండా లోడ్ రీప్లేస్మెంట్ చర్యలు చేపట్టాలి. సబ్ స్టేషన్ కెపాసిటీ కంటే ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైనచోట సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. కోర్ అర్బన్ రీజియన్‌లో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల అవసరం ఉందో గుర్తించాలి. అర్బన్ ఏరియాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లలో అధునాతన సాంకేతికను ఉపయోగించాలి. కరెంట్‌తో పాటు ఇతర కేబుల్స్‌కు కూడా అండర్ గ్రౌండ్ విధానాన్ని ఉపయోగించుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి. బెంగుళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టులను అధ్యయనం చేయాలి” అని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్​మిట్టల్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్​ రెడ్డి, ఎస్పీడీసీఎల్​సీఎండీ ముషారఫ్ ఫారూఖ్ పాల్గొన్నారు. 

సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలి.. 

రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు అనుగుణంగా కొత్త పథకాలను, ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘మోడల్ సోలార్ రూఫ్ టాప్ విలేజ్’ పనుల వివరాలను అధికారులు  వివరించారు. ‘ఇందిరా సోలార్ గిరి జల వికాసం’ పథకం ద్వారా రైతులకు సోలార్ పంపుసెట్లను అందించాలని అధికారులకు సీఎం సూచించారు. అలాగే వ్యవసాయ పంపుసెట్లకు కంటైనర్ ఆధారిత సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ విధానం మహిళా రైతులకు అదనపు ఆదాయం అందించడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు జూనియర్, డిగ్రీ కళాశాలలు వంటి అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్​విద్యుత్​ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ భవనాలు, పాఠశాలల వివరాలను అధికారులు వివరించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఎక్కువ పెట్టుబడులను ఆహ్వానించాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు, బడ్జెట్ అంచనాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.