జూబ్లీహిల్స్ లో తనిఖీలు ముమ్మరం.. రూ.88.45 లక్షలు, 255 లీటర్ల లిక్కర్ స్వాధీనం

జూబ్లీహిల్స్ లో తనిఖీలు ముమ్మరం..  రూ.88.45 లక్షలు, 255 లీటర్ల లిక్కర్ స్వాధీనం
  • 54 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదు, లిక్కర్ ఇతర వస్తువుల వివరాలతో మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ రిపోర్టు రిలీజ్​చేశారు. 

ఇప్పటివరకు మొత్తం రూ. 88.45 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రూ.12.90 లక్షలు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు రూ.45.72 లక్షలు, పోలీస్ బృందాలు రూ.29.82 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సరైన వివరాలు చూపితే ఈ నగదు తిరిగి ఇవ్వనున్నారు.

 అలాగే ఇప్పటివరకు  255.56 లీటర్ల మద్యాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖలు స్వాధీనం చేసుకున్నాయని, వీటితో పాటు, రూ. 72,740 విలువైన ఇతర వస్తువులు( పీడీఎస్ బియ్యం, ల్యాప్‌‌టాప్, వాహనాలు, కుక్కర్లు, చీరలు)   స్వాధీనం చేసుకున్నారు. 77 గ్రాముల డ్రగ్స్‌‌ను కూడా అధికారులు పట్టుకున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 48 కేసులు నమోదు కాగా, వాటిలో 29 కేసులలో ఎఫ్‌‌ఐఆర్‌‌లు దాఖలు చేశారు. 

నియోజకవర్గంలో 45 ఫ్లయింగ్ స్క్వాడ్‌‌లు, 45 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల వాహనాలకు జీపీఎస్, పీటీజెడ్ కెమెరాలను అమర్చి, జీహెచ్‌‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి 24గంటలు పర్యవేక్షిస్తున్నారు.

 నియోజకవర్గంలోని మొత్తం 407 పోలింగ్ కేంద్రాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా, వీటిలో 54 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా  గుర్తించారు. పోలింగ్ రోజున ఈ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.