వరద సహాయ చర్యలపై మాక్ డ్రిల్

వరద సహాయ చర్యలపై మాక్ డ్రిల్
  • ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, ఇతర శాఖల ఆధ్వర్యంలో సహాయక చర్యలు
  • హైదరాబాద్ నుంచి పర్యవేక్షించిన పెద్దాఫీసర్లు

హనుమకొండ/ కాశీబుగ్గ, వెలుగు: ప్రకృతి విపత్తులు, వరదలు సంభవించినప్పుడు రెస్క్యూ టీమ్స్, వివిధ శాఖల ఆఫీసర్లు చేపట్టే సహాయక చర్యలపై సోమవారం వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతం, సమ్మయ్యనగర్, రెడ్డిపురంలో మాక్ డ్రిల్​ నిర్వహించారు. కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగగా, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి వివరించారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి 50 మంది, ఫైర్ డిపార్ట్మెంట్ 22 మంది, ఎన్సీసీ క్యాడెట్లు 30, ఆపదమిత్ర వలంటీర్లు 30 మంది, రెడ్ క్రాస్, మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, వివిధ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు మాక్ ఎక్సర్సైజ్ లో పాల్గొని సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి జనాలను పునరావాస కేంద్రాలకు తరలించడం, అక్కడ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సదుపాయాలు కల్పించడం, తదితర సేవలపై అవేర్నెస్ కల్పించారు. 

డ్రోన్లతో ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్

జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) మార్గదర్శకాల ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించగా, ఎస్డీఆర్ఎఫ్ ఆఫీసర్ రవిచౌహాన్ ఆధ్వర్యంలో రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఎమర్జెన్సీ సైరన్ మోగగానే ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది వరదలో చిక్కుకున్న వృద్ధులు, చిన్నారులు, మహిళలను తాళ్ల సహాయంతో బయటకు తీసుకువచ్చి స్నేహానగర్ లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. వృద్ధులు, రోగులను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్ట్రెచర్లపై సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. వరదల్లో చిక్కుకొని ఇళ్లపైకి చేరుకున్న ప్రజలకు డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు, డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ అందజేశారు. లైఫ్ బోట్, లైఫ్ జాకెట్, స్ట్రెచర్, రోప్ సాయంతో సహాయక చర్యలు కొనసాగించారు. 

వరదల్లో చిక్కుకున్న వారిని బోటు సాయంతో రక్షించే ప్రక్రియను రెడ్డిపురం చెరువులో నిర్వహించారు. పునరావాస కేంద్రంలో తివాచీ, బెడ్లు, బ్లాంకెట్లు, స్వెట్టర్లు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్, మందుల పంపిణీ చేయడంతో పాటు వరద బాధితులను లష్కర్ సింగారం పీహెచ్సీకి తరలించి డీఎంహెచ్​వోలు అప్పయ్య, సాంబశివరావు ఆధ్వర్యంలో చికిత్స అందించారు. 

హైదరాబాద్ నుంచి కంట్రోల్

వరద ప్రభావిత ప్రాంతమైన సమ్మయ నగర్ లో  మాక్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుండగా అక్కడి సిబ్బంది చేపడుతున్న సహాయక చర్యలను హైదరాబాదులోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రిటైర్డ్ మేజర్ సుధీర్ బాహల్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ పర్యవేక్షించారు. వీడియో కాల్ ద్వారా సహాయక చర్యలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు ఇచ్చారు.  గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్​ కలెక్టర్​ సత్యశారద, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, ఆపదమిత్ర వలంటీర్, ఎన్సీసీ కేడెట్లు, స్థానికులతో మాట్లాడి సహాయక చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. సమ్మయ్యనగర్ మాక్ డ్రిల్ ను  వరంగల్  వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి పరిశీలించారు. 

కార్యక్రమంలో డీసీసీ అంకిత్, వరంగల్​ అడిషనల్​ కలెక్టర్​ సంధ్యారాణి,​ హనుమకొండ ఆర్డీవో  రాథోడ్ రమేష్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, గ్రేటర్ సీఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, మున్సిపల్ ఫైర్ ఆఫీసర్ శంకర్ లింగం, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్, ఏసీపీలు నరసింహరావు, సత్యనారాయణ, రెడ్ క్రాస్ ఈసీ మెంబర్ ఈవీ. శ్రీనివాసరావు, ఇతర అధికారులు సహాయక చర్యలను పరిశీలించారు. కాగా వివిధ శాఖల సిబ్బంది చేపడుతున్న సహాయక చర్యలను స్థానికులు ఆసక్తిగా గమనించారు. 

మోరంచలో..

జయశంకర్​భూపాలపల్లి: భూపాపల్లి మండలం మోరంచపల్లి వాగులో ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలు, ఆరోగ్య, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సోమవారం మాక్ డ్రిల్ చేపట్టారు. మోరంచవాగులో మనుషులు, పశువులు కొట్టుకుపోయే  క్రమంలో కాపాడే క్రమాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పాల్గొని మాక్ డ్రిల్​ను పరిశీలించారు. వారివెంట అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీవో రవి తదితరులు ఉన్నారు.