- కార్యక్రమాన్ని బహిష్కరించిన ఏడుగురు వార్డు సభ్యులు
- ఉపసర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి డబ్బులిస్తానని మాటిచ్చి.. మోసం చేశాడని ఆరోపణ
- యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం ఫక్కీరుగూడెంలో ఘటన
యాదగిరిగుట్ట, వెలుగు : ‘ఉప సర్పంచ్‌గా ఎన్నుకుంటే మాకు డబ్బులు ఇస్తానని చెప్పిన వార్డు సభ్యుడు ఎన్నికయ్యాక మోసం చేశాడు. అతడు డబ్బులు ఇస్తేనే మేం ప్రమాణస్వీకారం చేస్తాం’ అంటూ వార్డు సభ్యులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం ఫక్కీరుగూడెం గ్రామానికి ఈ నెల 11న మొదటి విడతలో ఎన్నికలు జరిగాయి. కాగా.. ఎనిమిదో వార్డు సభ్యుడిగా గెలిచిన జగ్గర్ల ఆనంద్‌గౌడ్.. తనను ఉపసర్పంచ్‌గా ఎన్నుకుంటే ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఇస్తానని మిగతా ఏడుగురు సభ్యులకు చెప్పాడు.
దీంతో వారు ఒప్పుకొని ఆనంద్‌గౌడ్‌ను ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. కానీ తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ వచ్చాడు. సోమవారం సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా.. ఏడుగురు వార్డుసభ్యులు కార్యక్రమానికి హాజరుకాలేదు. డబ్బులు విషయంలో ఆనంద్‌గౌడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించారు. అతడు డబ్బులు ఇస్తేనే తాము ప్రమాణస్వీకారం చేస్తామంటూ తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆఫీసర్లు సర్పంచ్, ఉపసర్పంచ్‌లతోనే ప్రమాణ స్వీకారం చేయించి వెళ్లిపోయారు.
