జనగామ అర్బన్, వెలుగు : రైతులకు యూరియా ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్దవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరువుల బుకింగ్ యాప్ను ప్రతి రైతు తప్పనిసరిగా వినియోగించాలని, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. సోమవారం జనగామ పట్టణంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి, యూరియా యాప్ ద్వారా ఇప్పటి వరకు జరిగిన అమ్మకాల ను సంబంధిత రిజిస్టర్ లో పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులందరూ ఈ యాప్ను వినియోగించాలని, ఎలాంటి సందేహాలున్నా సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ అపర్ణ, టెక్నీకల్ ఏవో శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
