జై శ్రీరాం : అయోధ్య రైల్వే స్టేషన్ పేరు మార్పు

జై శ్రీరాం : అయోధ్య రైల్వే స్టేషన్ పేరు మార్పు

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్‌లోని రైల్వే స్టేషన్‌ను అయోధ్య ధామ్ జంక్షన్ గా మార్చినట్టు వెల్లడించింది. డిసెంబర్ 30న 'అయోధ్య ధామ్ జంక్షన్'ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కాగా ఈ స్టేషన్ అభివృద్ధి మూడు దశల్లో జరగాలని యోచిస్తున్నప్పటికీ, ప్రారంభోత్సవానికి ముందే మొదటి దశ పూర్తయింది. స్టేషన్ పేరు మార్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనను తాజాగా భారతీయ రైల్వే అంగీకరించింది. అయితే, స్టేషన్ కోడ్ లో మాత్రం ఎలాంటి మార్పు అలాగే ఉండనుంది.

జంక్షన్ నిర్మాణానికి సంబంధించిన రాళ్లను రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని బన్సీ పహర్‌పూర్ ప్రాంతం నుంచి తీసుకొచ్చారని, అదే స్థలం నుంచి రామ మందిర నిర్మాణానికి రాళ్లను కూడా సప్లై చేశారని సమాచారం.  రైల్వే స్టేషన్‌లో శిశు సంరక్షణ, అనారోగ్యానికి గురైన వారికి ప్రత్యేక గది, పర్యాటక సమాచార కేంద్రం, ఫైర్ ఎగ్జిట్, దేశంలోనే అతిపెద్ద కాన్‌కోర్స్ లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణంలో గాయం లేదా ఏదైనా అనారోగ్యం సంభవించినప్పుడు, ప్రథమ చికిత్స లేదా వైద్య సహాయం కోసం స్టేషన్‌లో ప్రత్యేక గది కూడా అందుబాటులో ఉండడం గమనార్హం.

మొదటి అంతస్తులో ఫుడ్ ప్లాజా, వెయిటింగ్ హాల్, టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్ స్టేషన్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, స్టాఫ్ రూమ్‌లు, షాపులు, వెయిటింగ్ రూమ్‌లు, ఎంట్రీ ఫుట్‌బ్రిడ్జ్ వంటి లాంటి అదనపు సౌకర్యాలు కూడా ఉంటాయి. వికలాంగులకు అనుకూలంగా ఉండేలా టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉంచారు.