AI కత్తికి రెండు వైపులా పదునున్న అస్త్రం: AI ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రధాని మోదీ

AI కత్తికి రెండు వైపులా పదునున్న అస్త్రం: AI ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రధాని మోదీ

ఏఐ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కత్తికి రెండు వైపులా పదునున్న అస్త్రం అని అన్నారు ప్రధాని మోదీ. మనం అణుశక్తి విధ్వంసాన్ని చూశాం.. వికాసాన్నీ చూశాం.. AI కూడా అంతే.. రెండు వైపులా పదునున్న అస్త్రం అని.. వాడే విధానాన్ని బట్టి ఫలితాలు, పరిణామాలు ఉంటాయని అన్నారు. గురువారం (ఫిబ్రవరి 19) ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ను ప్రారంభించిన మోదీ.. ప్రపంచంలోనే అతిపెద్ద, చారిత్రాత్మక ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోందన్నారు. AI సమ్మిట్ నిర్వహణ భారత్ కే కాదు.. దక్షిణాసియాకే గర్వకారణం అంటూ కొనియాడారు. 

AIపై తొలినాళ్లలో అనేక సందేహాలు వచ్చాయన్నారు మోదీ. యువత ఇప్పుడు AI ని ప్రయోజనకరంగా ఉపయోగిస్తోందని కొనియాడారు. AI సదస్సు మేడిన్ ఇండియా, భారత్ సృజనాత్మకతకు వేదికగా నిలిచిందని తెలిపారు. AI ఇంపాక్ట్ సమ్మిట్ భారతీయ యువతలో కొత్త ఉత్సహాన్ని నింపుతోందని అన్నారు. ప్రపంచంలో ఆరో వంతుకు భారత్ ప్రాతినిథ్యం వహిస్తోందని తెలిపారు. AI కేంద్రంగా భారత్ మారుతోందని చెప్పారు.

నిప్పు రవ్వను రాజేసిన యుగం నుంచి ఇప్పుడు ఏఐ యుగం వరకు మనిషి మేథస్సు ఎదిగిందని చెప్పిన మోదీ.. కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు AI ఇంపాక్ట్ సమ్మిట్ దోహదం చేస్తుందని తెలిపారు. AI లో విజన్ తో పాటు సామాజిక బాధ్యత కూడా చాలా ముఖ్యమని చెప్పారు.  భారత్ కు యువత.. కొత్త శక్తి, ఆస్తిగా మారారని అన్నారు ప్రధాని మోదీ.