- సిద్ధంగా ఉన్నది మాత్రం తక్కువే
- ఏఐ, కొత్త టెక్నాలజీలపై భయాలే కారణం
- లింక్డ్ఇన్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: చాలామంది ప్రొఫెషనల్స్ కొత్త సంవత్సరంలో ఉద్యోగాలు మారాలని ఎక్కువగా ఆలోచిస్తున్నారని లింక్డ్ఇన్ రిపోర్ట్ తెలిపింది. అయితే సర్వేలో పాల్గొన్న వారిలో 84 శాతం మంది కొత్త ఉద్యోగం కోసం సిద్ధంగాలేమని భయపడుతున్నారు. నియామక ప్రక్రియలో ఏఐ ప్రభావం పెరగడం, నైపుణ్యాల అవసరాలు మారడం దీనికి ప్రధాన కారణాలు.
2022 నుంచి ఒక్కో ఉద్యోగం కోసం పోటీ పడే అభ్యర్థుల సంఖ్య రెండింతలు పెరిగింది. ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్టులకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఏఐ టూల్స్ వాడటం వల్ల తమకు సరిపోయే అవకాశాలను గుర్తించడం సులభం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
లింక్డ్ఇన్ కెరీర్ నిపుణురాలు నిరాజిత బెనర్జీ మాట్లాడుతూ ఏఐ ద్వారా కెరీర్ నిర్మించుకోవడం కీలకంగా మారిందని, అభ్యర్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో ఏఐ సాయపడుతుందని తెలిపారు. ఈ సర్వేను గత నవంబర్లో నిర్వహించామని చెప్పారు.
