ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ సాంకేతికత బ్యాంకింగ్ రంగాన్ని ఏ విధంగా మార్చేయబోతుందో లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేసే ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ 'స్టాండర్డ్ చార్టర్డ్' స్పష్టం చేసింది. రాబోయే 2030 నాటికి తమ కార్పొరేట్ ఫంక్షన్ విభాగాల నుంచి దాదాపు 15 శాతం ఉద్యోగాలను తగ్గించుకోనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. దీనివల్ల సుమారు 7వేల 800 మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు.
ఈ భారీ లేఆఫ్స్ బ్యాంక్ యొక్క బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. గ్లోబల్ బ్యాంక్ నిర్వహణకు కీలకమైన ఆపరేషన్స్, కాంప్లయన్స్ సపోర్ట్, ఫైనాన్స్ ప్రాసెస్, రిస్క్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ సిస్టమ్స్ వంటి అంతర్గత విభాగాల్లో ఈ లేఆఫ్స్ ఎక్కువగా ఉండనున్నాయి. ఆయా విభాగాల్లో ఉన్న 52వేల మంది సిబ్బందిలో దాదాపు 7వేల నుండి 7వేల 800 మంది వరకు ఉద్యోగాలు కోల్పోనున్నారు.
►ALSO READ | గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట: అమెరికాలోనే ఉంటూ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం
ఈ తొలగింపులపై స్టాండర్డ్ చార్టర్డ్ సీఈఓ బిల్ వింటర్స్ చేసిన వ్యాఖ్యలు కార్మిక సంఘాలు, ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. కొన్ని విభాగాల్లో ఉద్యోగుల భర్తీ గురించి ఆయన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. టెక్నాలజీ కేవలం ఉద్యోగుల పనిని సులువు చేయడం మాత్రమే కాదు.. కంపెనీలు తక్కువ మంది సిబ్బందితో నడిచేలా మార్పులు తీసుకువస్తుందని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది.
రాబోయే రోజుల్లో ఏఐ టూల్స్ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందనే ఆందోళనను ఈ కార్పొరేట్ నిర్ణయం నిజం చేస్తోంది. ఏఐ పెట్టుబడుల కారణంగా బ్యాంకింగ్ రంగంలో మానవ వనరుల అవసరం ఎంతలా తగ్గిపోతుందో చెప్పడానికి స్టాండర్డ్ చార్టర్డ్ లో జరుగుతున్న మార్పులు పెద్ద ఉదాహరణగా నిలిచాయి.
